కేంద్రాన్ని వాడుకోవ‌డంలో బాబు వెనుక‌బ‌డ్డారా?

ఔను.. ఈ మాట సీనియ‌ర్ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి.. విశ్లేష‌కుల వ‌ర‌కు కూడా వినిపిస్తోంది. కూట‌మిలో ప్రధాన భాగ‌స్వామ్య ప‌క్షంగా టీడీపీ ఉంది. ప్ర‌స్తుతం కేంద్రంలో మోడీ అధికారంలో ఉండ‌డానికి కీల‌క‌మై న రెండు ప్ర‌ధాన పార్టీల్లో టీడీపీ మ‌రీ ముఖ్యం. బిహార్ అధికార పార్టీ జేడీయూ.. కంటే కూడా.. న‌లుగురు ఎంపీలు టీడీపీకే ఎక్కువ‌గా ఉన్నారు. పైగా.. జేడీయూ అధినేత‌, సీఎం నితీష్ కుమార్ మాదిరిగా చంద్ర‌బాబు ఏ క్ష‌ణాన ఎలా మారుతారో.. అన్న బెంగ కూడా లేదు.

దీంతో కేంద్రంలో చంద్ర‌బాబు అంటే.. అత్యంత న‌మ్మ‌కస్తుడైన మిత్ర‌ప‌క్షంగా ఉన్నారు. మ‌రి.. ఇంత బ‌ల‌మైన ముద్ర వేసుకున్న చంద్ర‌బాబు కూట‌మి త‌ర‌ఫున అనేక ప‌నులు చేయించుకునే వెసులు బాటు ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో వెనుక‌బ‌డ్డార‌న్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో కేంద్రం నుంచి ప్ర‌తిపాద‌న‌లు వెన‌క్కి రావ‌డం చ‌ర్చ‌గా మారింది. స‌రే.. దీనికి సంబంధించి కేంద్రానికి వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

మరో ముఖ్య‌మైన రెండు విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. 1) పొగాకు, 2) మామిడి. ఈ రెండు విష‌యాల్లోనూ.. కూడా చంద్ర‌బాబు కేంద్రం నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తును.. ఏపీకి ప్ర‌యోజ‌నాలు కూడ‌గ‌ట్ట‌లేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ రెండు అంశాల‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ.. క‌నీసం రోజుల వ్య‌వ‌ధిలో అయినా.. కేంద్రం నుంచి సానుకూల ప‌రిణామాల‌ను రాబ‌ట్ట‌లేక పోయారన్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇలా.. చంద్ర‌బాబు వైపు వేలెత్తి చూప‌డానికి కూడా ప్ర‌ధాన కార‌ణం ఉంది.

అదే.. ఈ రెండు విష‌యాల్లో క‌ర్ణాట‌క మాజీ సీఎం, జేడీఎస్‌ నాయ‌కుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కుమార స్వామి రాత్రికి రాత్రి సాధించ‌డ‌మే. జేడీఎస్ కూడా కేంద్రంలో భాగ‌స్వామి. కానీ, ఈ పార్టీకి కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. అయితే.. కుమార‌స్వామి సాధించారన్న‌ది విశ్లేష‌కులు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. క‌ర్ణాట‌క‌లో కూడా సేమ్ టు సేమ్‌.. పొగాకు, మామిడి కాయ‌ల స‌మ‌స్య ఉంది.

దీనిని ప్ర‌స్తావిస్తూ.. కుమార‌స్వామి లేఖ రాయ‌డంతో.. ఆ వెంట‌నే మామిడి కాయ‌ల‌ను కిలోకు రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేసింది. పొగాకును కూడా అంతే యుద్ధ‌ప్రాతిప‌దికన కొనే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. కానీ.. ఏపీలో ఆ త‌ర‌హా దూకుడు లేదు. ఇద్ద‌రు కేంద్ర మంత్రులు.. 21 మంది ఎంపీలు ఉన్నా.. ఎందుకో .. చంద్ర‌బాబు మంచిత‌నంతో.. చాలా స‌హృద‌యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇది కేంద్రానికి మేలు చేస్తుంది కానీ.. స్థానికంగా టీడీపీకి ఇబ్బందులు తెస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.