తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఒక్కసీటు తగ్గినా.. తానే బాధ్యత తీసుకుంటానని తేల్చి చెప్పారు. దీనికి ఎవరినీ బాధ్యులను చేయబోనన్న ఆయన.. ఇప్పటి నుంచే కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయ భేరి’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోయారని.. మూడు నాళ్లలోనే ఈ ప్రభుత్వం కుప్ప కూలుతుందని వ్యాఖ్యలు చేశారని.. కానీ, అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల గడీల పాలనను బద్దలు కొట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయాన్ని దక్కించుకుందన్నారు. కాంగ్రెస్ నాయకులు అంటే ఐక్యత ఉండదన్న అపప్రదను పోగొట్టామని చెప్పారు. ఐక్యంగా ముందుకు సాగుతూ.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయానికి సీట్లు పెరుగుతున్నాయని తెలిపారు.
అప్పుడు కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ ఆశలు, ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. “జనగణనతో పాటు కులగణన.. ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్‌గాంధీ మాటిచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం.” అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే ఐక్యతతో వచ్చే ఎన్నికల్లోనే కాదు.. మళ్లీ మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌కు సవాల్!
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు బహిరంగ సవాల్ రువ్వారు. తాము అధికారంలోకి వచ్చిన 18 నెల్లలోనే 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దీనిపై చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామన్న సీఎం.. ఇప్పటికిప్పుడు ఆ 60 వేల మందిని పిలవమన్నా పిలుస్తామని.. లెక్క ఒక్కటి తగ్గినా.. కాళ్లు మొక్కుతానని సవాల్ రువ్వారు. తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రైతు రాజ్యం ఎవరు తెచ్చారో.. ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates