గిరిజ‌నుల మ‌న‌సు దోచిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈసారి ఇలా!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గిరిజ‌నుల సంక్షేమం.. వారి సౌక‌ర్యాలు వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా గిరిజ‌న ప్రాంతాల్లో ర‌హ‌దారులు వేయిస్తున్నారు. వారికి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తున్నారు. అంతేకాదు.. వారి మ‌న‌సెరిగి మెసులు కుంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజ‌నుల కుటుంబాల‌కు పాద‌ర‌క్ష‌లు పంపించిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

అప్ప‌ట్లో అడ‌వి బిడ్డ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆప్యాయ‌త‌కు పొంగిపోయారు. మూడు మాసాల కింద‌ట‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్లూరి జిల్లాలో సుదూరంగా ఉండే కురిడి గ్రామాన్ని సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న అక్క‌డ కాలికి చెప్పులు లేకుండా రాళ్లు ర‌ప్ప‌ల‌పై తిరుగుతున్న గిరిజ‌నుల‌ను చూసి ద్ర‌వించిపోయారు. ఈ క్ర‌మంలోనే తాను తిరిగి మంగ‌ళ‌గిరికి వ‌చ్చాక‌.. ప్ర‌త్యేక వాహ‌నంలో 500 మందికి పైగా చెప్పుల జ‌త‌లు పంపించారు. దీంతో గిరిజ‌నుల క‌ళ్ల‌లో ఆనంద‌రం.. సుడులు తిరిగింది.

తాజాగా మ‌రోసారి ఆ ప్రాంత గిరిజ‌నుల ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. వారికి త‌న తోట‌లో పండించిన మామిడి పండ్ల‌ను పంపించారు. అయితే.. ఈ విష‌యాన్ని ముందుగానే ఎవ‌రికీ చెప్ప‌కుండా.. చాలా గోప్యంగా ఉంచారు. మొత్తం 300ల‌కు పైగా కుటుంబాలు కురిడి గ్రామంలో ఉన్నాయి. అక్క‌డి ప్ర‌తి ఇంటికీ.. అర‌డ‌జ‌ను చొప్పున నాణ్య‌మైన తీపి మామిడి పండ్ల‌ను పంపించారు.

ప్ర‌త్యేక వాహ‌నంలో మంగ‌ళ‌గిరి నుంచి చేరిన మామిడి.. ఇంటింటికీ అందాయి. దీంతో గిరిజ‌న బిడ్డ‌లు ఎంతో ఆప్యాయంగా వాటిని ఆర‌గించారు. కాగా.. ఈ మామిడి పండ్ల‌ను ఆర్గానిక్‌(సంప్ర‌దాయ ఎరువుల విధానం) విధానంలో పండించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తికుటుంబానికీ ఆరేసి చొప్పున వీటిని అందించారు. దీంతో గిరిజ‌నులు మా మంచి ప‌వ‌న్ అంటూ.. మురిసిపోయారు.