తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు. గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత.. ఆయన నీరసంగా కనిపించడంతోపాటు.. నడవలేని స్థితికి చేరుకున్నారు. దీంతో కు టుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెనువెంటనే ఆయన ను ఐసీయూకు తరలించినట్టు తెలిసింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. ప్రాథమిక వైద్యం అందించారు. దీనికి సంబంధించి యశోదా ఆసుపత్రి రాత్రి 9 గంటల సమయంలో బులెటిన్ విడుదల చేసింది.
దీనిలో కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. అయితే.. బ్లడ్ షుగర్ ఎక్కువ కావడం, శరీరంలో సోడియం లెవిల్స్ పడిపోవడంతో ఆయన సత్తువ కోల్పోయారని వైద్యులు తెలిపారు. దీంతోపాటు ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ.. ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గురువారం ఆయనను పూర్తి అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. మరోవైపు.. కేసీఅర్ ఆరోగ్య పరిస్థితి పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా యశోదా వైద్యులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. త్వరగా కోలుకునేలా చూడాలన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు, నీరసంగా ఉండటంతో… ఆసుపత్రిలో చేరారని సీఎం రేవంత్‌రెడ్డికి కూడా తెలిపారు.
నిషేధాజ్ఞలు..
కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున యశోదా ఆసుపత్రికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు వాహనాలను అనుమతించకుండా.. నిషేధాజ్ఞలు జారీ చేశారు. సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్‌లలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates