వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు సంబంధించి నమోదు అయిన కేసుల నుంచి ఎట్టకేలకు తాత్కాలిక ఉపశమనం పొందిన ఆ పార్టీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం తన సతీమణిని వెంటబెట్టుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లిన వంశీ… జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వంశీని జగన్ ఆప్యాయంగా భుజం తట్టడం కనిపించింది.
జైలులో ఉండగా… పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వంశీ… జైలు నుంచి విడుదలైన మరునాటికే ఒకింత యాక్టివ్ గా కనిపించారు. జగన్ తో చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఫొటోలకు ఫోజులిచ్చారు. జగన్ కు ఓ వైపు వంశీ నిలబడగా… ఆయన సతీమణి జగన్ కు మరోవైపు నిలుచుని కనిపించారు. ఆ తర్వాత బార్యాభర్తలిద్దరూ జగన్ తో కొంతసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఇక భయం ఏమీ లేదని తామంతా అండగా ఉన్నామని వంశీకి జగన్ భరోసా ఇచ్చారు. గన్నవరం రాజకీయాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన వంశీపై ఆ తర్వాత అంతకుముందు నమోదు అయిన కేసులన్నీ ఓపెన్ అయిపోయాయి. దీంతో ఓ కేసులో బెయిల్ వచ్చినా… మరో కేసులో రిమాండ్ తో వంశీ ఏకంగా 4 నెలల 20 రోజుల పాటు జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వంశీ జైలులో ఉండగా..జగన్ స్వయంగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ వంశీని పరామర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates