‘బ‌న‌క‌చ‌ర్ల‌’లో వైసీపీ వేలు: కూపీ లాగుతున్న బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏదైనా ప్రాజెక్టు చేప‌డితే.. దానికి ముందు వెనుక అనేక రూపాల్లో ఆలోచించే నిర్ణ‌యం తీసుకుంటారు. ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు ఆయ‌న వంద సార్లు ఆలోచ‌న చేస్తారు. గ‌తంలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఏర్పాటు విష‌యంలోనూ ఆయన అనేక విధాలుగా అధ్య‌య‌నం చేశారు. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా రాజ‌ధానిని తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌ను ఒప్పించి.. మెప్పించి.. ఆయ‌న రాజ‌ధానికి శ్రీకారం చుట్టారు. అలానే క‌ర్నూలు జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన ‘బ‌న‌క‌చ‌ర్ల‌’ బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు విష‌యంలో కూడా చంద్ర‌బాబు అడుగులు వేశారు.

అనేక మంది నిపుణుల‌ను సంప్ర‌దించారు. అనేక నివేదిక‌లు కూడా రూపొందించుకుని ప‌రిశీల‌న చేశారు. గోదావ‌రి న‌ది నుంచి స‌ముద్రంలోకి పోయే వృథా జ‌లాల‌ను వాడుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న జ‌ల వివాదాల గురించి చంద్ర‌బాబుకు తెలియంది కాదు. అందుకే.. అధికారంలోకి వ‌చ్చిన ఆరుమాసాల పాటు.. బ‌న‌క‌చ‌ర్ల‌పై అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు చేప‌ట్టారు. జ‌ల‌వ‌న‌రుల నిపుణుల‌ను పిలిచి చ‌ర్చించారు. పోల‌వ‌రం నుంచి ఎత్తిపోత‌ల విధానంలో బ‌న‌క‌చ‌ర్ల‌కు గోదావ‌రి జ‌లాల‌ను త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై అనేక క‌స‌ర‌త్తులు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ విభాగం త‌ప్పుబ‌డుతూ.. వెన‌క్కి పంపించింది.

ఈ స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణ విభాగం అధికారులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ‌కు పలు ఫిర్యాదులు అందాయ‌ని తెలిపారు. ఇదే స‌మయంలో వంద‌లు వేల కొద్దీ ఈ-మెయిళ్లు కూడా వ‌చ్చాయ‌ని.. వారంతా బ‌న‌క‌చ‌ర్ల‌కు ఆమోదం తెల‌ప‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించా రని కూడా కేంద్ర అధికారులు వెల్ల‌డించారు. దీంతో సాధార‌ణంగా తెలంగాణ నుంచే ఇలా అడ్డంకులు వ‌స్తున్నాయ‌ని అంద‌రూ అనుకున్నారు. ఇది స‌హ‌జ‌మే. తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా.. విప‌క్షాలు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో అడ్డు చెబుతున్నాయి. కానీ.. ఈ-మెయిళ్లు పంపించాల్సిన అవ‌స‌రం తెలంగాణ స‌ర్కారుకు లేదు. ఎందుకంటే.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదుల‌తో కూడిన నివేదిక‌ను అందించారు.

అంటే.. తెర‌చాటున గోప్యంగా ఎవ‌రికీ తెలియకుండా ఈ-మెయిళ్ల ద్వారా బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకోవాల్సిన అవ‌స‌రం తెలంగాణ‌కు లేదు. ఏదైనా ఉంటే నేరుగానే స్పందిస్తోంది. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన చంద్ర‌బాబు, జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు తాజాగా ఈ-మెయిళ్ల వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టారు. వంద‌ల కొద్దీ ఈ-మెయిళ్లు వ‌చ్చాయ‌ని కేంద్ర అధికారులు చెప్ప‌డంతో ఈ ప‌నిని వైసీపీ నాయ‌కులే చేసి ఉంటార‌ని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. గ‌తంలో అమ‌రావ‌తివిష‌యంలోనూ ఇలానే లేఖ‌లు, ఈ-మెయిళ్ల ద్వారా వైసీపీ నాయ‌కులు అడ్డుకున్న విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు.

ప్ర‌పంచ బ్యాంకు నుంచి అమ‌రావ‌తికి అప్పు పుట్ట‌కుండా, కాంట్రాక్టు సంస్థ‌లు ఈ ప‌నులు చేప‌ట్ట‌కుండా చేసేందుకు అప్ప‌ట్లో(2014-19) వైసీపీ మెయిళ్ల యుద్ధం చేసింది. త‌ద్వారా రాజ‌ధానిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. అలానే ఇప్పుడు కూడా బ‌న‌క‌చ‌ర్ల‌పై కుట్ర చేస్తోందా? అని చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఈమెయిళ్ల స‌మాచారం ఇవ్వాల‌ని కోరుతూ.. కేంద్ర అధికారుల‌కు లేఖ రాయాల‌ని నిర్ణ‌యించారు. దీనిని బ‌ట్టి ముందుకు సాగాల‌ని భావిస్తున్నారు. ఇదే నిజ‌మైతే.. వైసీపీపై చంద్ర‌బాబు ఉగ్ర‌తాండ‌వం చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.