గత 15 రోజులకుపైగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన .. సింగయ్య మృతి కేసు యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న వాదన వీగిపోతుందా? అంటే.. ఔననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా సింగయ్య భార్య లూర్దు మేరి.. మీడియా ముందుకు వచ్చారు. తన భర్త కారు కింద పడడం వల్ల మృతి చెందలేదన్నారు. ఆయన మరణంపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. కావాలనే ఎవరో చంపేసి ఉంటారని.. ఆసుపత్రికి వెళ్లే వరకు కూడా.. సింగయ్య ఒంటిపై పెద్దగా గాయాలు కూడా లేవన్నారు.
ఈ కేసును మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో లూర్దు మేరి.. అటు పోలీసుల పైనా.. ఇటు టీడీపీ నాయకులపైనా సందేహాలు వ్యక్తం చేశారు. పోలీసులు తమ పై ఒత్తిడి తెచ్చి.. కేసు పెట్టించారని అన్నారు. ఇక, టీడీపీ నాయకులు కూడా తమ ఇంటికి పదే పదే వచ్చి.. తమను చెప్పినట్టు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో తాము చాలా వరకు ఇబ్బంది పడ్డామన్నారు. అందుకే.. ఈ కేసుపై మాట్లాడేందుకు తాము బయటకు రాలేకపోయామని చెప్పారు.
“సింగయ్య మృతి పై అనుమానాలున్నాయి. కారు కింద పడితే చిన్న గాయాలైన వ్యక్తి ఎలా చనిపోయాడు. పోలీసులు మమ్మల్ని ఆరోజు ఆటోలోకి కూడా ఎక్కడానికి అనుమతించలేదు. సింగయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించిన తర్వాత ఏదో జరిగింది.” అని లూర్దు మేరీ అన్నారు. “లోకేష్ పేరు చెప్పి మా ఇంటికి వచ్చిన కొందరు టీడీపీ నేతలు.. వాళ్లు చెప్పిన విధంగా కేసు పెట్టాలని బెదిరించారు.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగింది?
గత నెల జూన్ 18న జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సమ యంలో ఆయన కాన్వాయ్ కిందప డి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెప్పారు. దీనిపై అనేక రాజకీయాలు.. జరిగాయి. మరోవైపు కోర్టులలోనూ ఈ కేసు విచారణకు వచ్చింది.జగన్‌ను ఏ2గా పేర్కొంటూ.. కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసు విచారణపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. ఈ నేపథ్యంలో సింగయ్య భార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates