బలమైన నాయకులే కావొచ్చు.. నియోజకవర్గాల్లో తిరుగులేని ఓటు బ్యాంకు కూడా ఉండొచ్చు.. ప్రజల మధ్య మంచి సానుకూలత కూడా ఉండొచ్చు. కానీ, ఎంత ఉన్నా.. ఒదిగి ఉండడమనే దండలోని దారం వంటి లక్షణమే ఏ నాయకుడికైనా కీలకం. ఒకప్పుడు అంటే.. నాయకులు తక్కువ.. పార్టీల పరిధి ఎక్కువగా ఉండేది. పైగా సామాజిక వర్గాల వారీగా.. ప్రభావితం చేస్తారన్న ఆలోచన కూడా ఉండేది. అందుకే.. ఓ 15 ఏళ్ల కిందట.. నాయకులపై పార్టీలు ఆధారపడి ఉండేవి. కానీ, మారుతున్న కాలం .. మారుతున్న రోజులతోపాటు.. పార్టీలు కూడా తమ సిద్ధాంతాల మాట ఎలా ఉన్నా.. పద్ధతులను మాత్రం మార్చుకుంటున్నా యి.
దీనిని నాయకులు గ్రహించాలి. ఒకప్పుడు ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశ పెడితే.. దానిని క్షేత్రస్థాయిలో నాయకులు ప్రజల వద్దకు వెళ్లి అందించేవారు. తద్వారా ప్రజలకు-నాయకులకు మధ్య బాండింగ్ పెరిగేది. కానీ, నేడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దాదాపు ప్రభుత్వాలే.. ఆన్‌లైన్, డీబీటీల ద్వారా ప్రజలకు ఆయా పథకాల ఫలాలను అందిస్తున్నాయి. దీంతో నాయకులను ఓవర్ టేక్ చేసి.. పార్టీలు.. ప్రజలతో అనుబంధం పెంచుకుంటున్నాయి. దీంతో నాయకులు ఎంత బలవంతులు అయినా.. పార్టీ ముందు.. తగ్గి ఉండక తప్పని ఒక అనివార్య పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. కాదు.. కూడదు.. అన్న నాయకులను పార్టీలు పక్కన పెట్టేస్తున్నాయి.
తాజాగా తెలంగాణ ఫైర్‌బ్రాండ్ బీజేపీ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయం కూడా దాదాపు ఇంతే. ఆయన మారిన కాల మాన పరిస్థితులకు తగిన విధంగా మారడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఏ నాయకుడికైనా పార్టీనే సుప్రీం. అది బీజేపీ అయినా.. మరో పార్టీ అయినా.. అలాగని సూచనలు, సలహాలు చెప్పడంలో తప్పులేదు. పదవులు ఆశించడంలోనూ తప్పుకాదు. కానీ, వాటికి కూడా వేదికలు ఉంటాయి. చెప్పుకొనే పద్ధతులు ఉంటాయి. కానీ, ఇంటా-బయటా కూడా.. వివాదా లతోనే కాలం గడుపుతామన్న విధానంలో రాజా సింగ్ వ్యవహరిస్తున్నారు. ఇది ఏ పార్టీ కూడా సహించేది కాదు. ఆయన ఆగ్రహం నేటి కాలానికి తగిన విధంగా అయితేలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
తన ఆవేదన, ఆక్రోశం, ఆకాంక్షలు చెప్పుకొనేందుకు వేదికలు చాలానే ఉన్నాయి. ఢిల్లీలో పార్టీ అధిష్టానం కూడా ఉంది. కానీ, ఈ విధానాలను వదిలేసి.. నాకు తిరుగులేదని అనుకుంటే.. బీజేపీ అలాంటి వాటిని సహించే పరిస్థితిలో ఇప్పుడు లేదు. పైగా.. మోడీ ప్రధానిగా వచ్చాక.. పార్టీలో ఏకపక్ష రాజకీయాలకు చెక్ పెట్టారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ చాలా చిన్నదనే చెప్పాలి. గుజరాత్, మహారాష్ట్ర, యూపీ వంటి కీలక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కొమ్ములు తిరిగిన నాయకులు.. పార్టీ కి విధేయులుగా ఉంటున్నారు. ఉండాల్సిన పరిస్థితిని పార్టీ అలా కల్పించింది. సో.. రోజులు మారాయి.. రాజాసింగే మారలేదు! అనే మాట వినిపించకుండా ఉండాలంటే.. ఆయనే మారాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates