కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ప్రజల మధ్య ఉండాలని.. ప్రజల వద్దకువెళ్లాని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక దిశానిర్దేశం చేశారు. దీనికి గడువు కూడా వచ్చేసింది. బుధవారం నుంచి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల వద్దకు వెళ్లి.. కూటమి ఏడాది పాలనలో చేసిన మంచి పనులను వివ రించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే ఫీలింగును ప్రజల్లో కల్పించాలి. అంతేకాదు.. చేసిన పనులపై వారి సంతృప్త స్థాయిలను కూడా తెలుసుకోవాలి. సమస్యలు తెలుసుకుని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
ఇదీ.. ఇతమిత్థంగా సీఎం చంద్రబాబు టీడీపీ మంత్రులు, నాయకులకు తేల్చి చెప్పిన విషయం. అంతేకాదు.. తాను కూడా త్వరలోనే ప్రజల మధ్యకు వస్తానని చెప్పుకొచ్చారు. అయితే.. వాస్తవానికి ఏదైనా చెప్పినంత ఈజీ కాదు కదా!. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి మరింత కష్టం. ప్రతిపక్షంపై అంటే విరుచుకుపడతారు.. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం పెద్ద ఇబ్బందే. ఇదే ఇప్పుడు కూటమిని కలవరపెడుతోంది. నాయకులకు కూడా ప్రజల మధ్యకు వెళ్లాలనే ఉంది. కానీ, ఎటొచ్చీ ఏడాది కాలంలో పింఛన్లు ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అయితే.. వ్యక్తిగతంగా అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి.
వాటిని పరిష్కరించడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు. పైగా.. సంక్షేమ పథకాల్లోనూ కొన్ని కోతలు పడ్డాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల తండాల్లోని వారు.. రేషన్ దుకాణాల స్థానంలో వాహనాలను కోరుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు చెప్పేశారు. కానీ, పరిష్కారం మాత్రం కనిపించలేదు. ఇక, తల్లికి వందనం పథకంలో చాలా మంది ఎలిమినేట్ అయ్యారు. వీరి ఇళ్లకు 300 యూనిట్ల విద్యుత్ వచ్చిందనేది కారణం. కానీ, క్షేత్రస్థాయిలో ఉమ్మడి కుటుంబాలు కూడా ఉన్నాయి. దీంతో ఇలాంటివారు ఇబ్బందులు పడుతున్నారు.
అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్ల కింద కేటాయించిన కుటుంబాలకు కూడా తల్లికి వందనం ఇవ్వలేదు. పోనీ.. అక్కడ సీట్లు ఇచ్చారా? అంటే.. ఫీజులు కట్టించుకుని ఇచ్చారు. ఇలా.. మొత్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటికి తోడు.. కొత్తగా పథకాలు కోరుకునేవారు.. ఇళ్లు కోరుకునేవారు, పింఛన్ల కోసం వేచి చూస్తున్నవారు.. కోకొల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేకానీ.. మంత్రులు కానీ.. నేరుగా వారి ఇళ్లకు వెళ్లడం అంటూ.. జరిగితే.. ఆయా సమస్యలకు వీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
కానీ, ప్రస్తుత రాష్ట్ర సర్కారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు దీనిపై గుంజాటనలో ఉన్నారు. “ప్రజల వద్దకు వెళ్లమని మా సార్ చెప్పారు. వెళ్తాం. కానీ, అక్కడ ఎదురయ్యే సమస్యలపై ఏం చేయాలో అర్ధం కావడం లేదు. దీనిపై కూడా మా సార్ పరిష్కారం చూపిస్తే బాగుండేది” అని ఓ మహిళా మంత్రి వ్యాఖ్యానించడం కొసమెరుపు. గతంలో వైసీపీ హయాంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించారు. కానీ, అప్పట్లోనూ ఇదే సమస్య ఎదురైంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates