వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు మంగళవారం భారీ ఊరట లభించింది. అయితే ఈ ఊరట పర్మనెంటా?, లేదంటే తాత్కాలికమేనా? అన్నది బుధవారం మధ్యాహ్నానికి గాని తెలియదు. ఏదైనా కొత్త కేసు నమోదు కాకపోతే వంశీ బెయిల్ పై బయటకు వచ్చినట్టే. లేదంటే అంతే సంగతులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా… ఇదివరకే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
వంశీని తొలుత దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో బెజవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఇది జరగి దాదాపుగా నాలుగు నెలలు కావస్తోంది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి రిమాండ్ విధించగా… పోలీసులు బెజవాడ జిల్లా కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఇప్పటిదాకా ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అప్పటికే వంశీపై నమోదై ఉన్న పాత కేసులను పోలీసులు తిరగదోడారు. ఫలితంగా ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో రిమాండ్ తో ఆయన సుదీర్ఘ జైలు జీవితాన్ని గడిపారు.
ఇటీవలే దాదాపుగా అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ రాగా… ఒక్క నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో మాత్రం వంశీకి బెయిల్ రాలేదు. దీంతో ఆయన జైలులోనే రిమాండ్ ఖైదీగా గడపాల్సి వచ్చింది. 2024 ఎన్నికలకు ముందు జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు చాలా మంది వైసీపీ నేతలు ఇలా నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ కోణంలో ఆలోచించగా..వంశీ కూడా ఈ మోసానికి పాల్పడినట్టు తేలడంతో ఆయనపైనా కేసు నమోదు అయ్యింది. వంశీ జైలుకు వెళ్లిన తర్వాత ఈ కేసు నమోదు కావడం గమనార్హం.
కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు కూడా నమోదై ఉంది. అంతేకాకుండా భూకబ్జాలు, బెదిరింపులు, అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల కేసు…ఇలా చాలా కేసులే ఉన్నాయి. 2019లో టీడీపీ టికెట్ పైనే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ… ఆ తర్వాత సీఎంగా మారిన జగన్ పంచన చేశారు. జగన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తో వంశీ గన్నవరంలో సామంతరాజులా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates