2 నుంచి ఏపీలో రప్పా…. ర‌ప్పా!!

మ‌రో రెండు రోజులు.. ఖ‌చ్చితంగా జూలై 2వ తేదీ నుంచి ఏపీలో రాజ‌కీయాలు నిజంగానే ర‌ప్పా… ర‌ప్పా.. డైలాగును గుర్తుకు తేనున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య మ‌రింత జోరుగా హోరుగా రాజ‌కీయ ర‌గ‌డ చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తిప‌క్ష‌-అధికార పార్టీ మ‌ధ్య రాజ‌కీయం మ‌రింత సెగ పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే వైసీపీ.. రీకాలింగ్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో పేరుతో ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని లాంచ్ చేసింది. ప‌లు జిల్లాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. దీనిపై తాజాగా జ‌గ‌న్ స‌మీక్ష కూడా నిర్వ‌హించారు.

ప‌లు జిల్లాల్లో కొంద‌రు నాయ‌కులు ముందుకురాని విష‌యం పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి.. త‌నే స్వ‌యంగా ఫోన్లు చేస్తాన‌ని.. ఎక్క‌డ‌కు వెళ్తున్నారో.. ఏ రూపంలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారో తెలుసుకుంటాన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంటే.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మం ఇక నుంచి మ‌రింత వాడి వేడిగా సాగ‌నుంద‌న్న‌ది తెలుస్తోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో కూట‌మి ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ కూడా.. “ఇది మంచి ప్ర‌భుత్వం” పేరుతో జూలై 2వ తేదీ నుంచి వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది.

ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఏడాది పాల‌న‌లో చేసిన మంచిని.. తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డుల‌ను నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స‌హా అంద‌రూ.. గ్రామ గ్రామాన ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయ‌నున్నారు. అంతేకాదు.. వైసీపీ చేసే దుష్ఫ్ర‌చారాన్ని కూడా అడ్డుకోవాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. తాను కూడా స్వ‌యంగా తొలి వారం రోజులు గ్రామాల్లో తిరుగుతాన‌ని చెప్పారు. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారుప‌ర్య‌టించాల‌ని అల్టిమేటం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేసిన క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇస్తామ‌ని కూడా ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో వైసీపీకి దీటుగా టీడీపీ నాయ‌కులు కూడా ఇంటింటికీ తిరిగేందుకు.. పాల‌న‌పై ప్ర‌చారం చేసేందుకు రెడీ అవుతున్నారు.

అంటే.. మ‌రో రెండు రోజుల్లోనే ఈ కార్య‌క్ర‌మం కూడా ఊపందుకోనుంది. టీడీపీ నాయ‌కుల‌తోపాటు.. అన్ని జిల్లాల పోలీసుల‌ను కూడా.. ప్ర‌భుత్వం అలెర్ట్ చేసింది. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డైనా అడ్డు ప‌డితే క్రిమినల్ కేసులు న‌మోదు చేయాల‌ని సూచించింది. త‌క్ష‌ణ‌మే అరెస్టు కూడా జ‌ర‌గాల‌ని పేర్కొంది. ఈ విష‌యం తెలిసిన వైసీపీ ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా.. ఎదుర్కొనేందుకు రెడీ కావాల‌ని.. నాయ‌కులు ధైర్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేయాల‌ని పేర్కొంది. సో.. 2వ తేదీ నుంచి రాజ‌కీయం మ‌రింత గ‌రంగ‌రంగా మారిపోతుంద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.