ఈసారి కేసులు మామూలుగా వుండవట

వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా సమావేశంలో పాల్గొన్నారంటే.. అందులో వైరివర్గాలపై తనదైన శైలి ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని సజ్జల ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల చేసిన ప్రసంగాన్ని వింటూ ఉంటే… నిజంగానే కేసులు ఇలాంటి కారణాలతో కూడా పెడతారా? అంటూ నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాస్తవ విరుద్దంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు విషయం తెలియని వారైతే నిజమేనేమోనని నమ్మేస్తారు.

సరే.. మరి సజ్జల ఏమన్నారంటే… “శింగనమలలో మనం ఇప్పుడు సమావేశం పెట్టుకున్నాం కదా… దీనిపైనా కేసులు పెడతారేమో. మన పార్టీ నేత సాకే శైలజానాథ్ మరింత గట్టిగా మాట్లాడారు కదా… ఆయనపై కేసు బుక్కయ్యేందుకు రంగం సిద్ధం అయిపోయి ఉంటుంది. శైలజానాథ్ కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. నువ్ గట్టిగా అరిచావ్… ఈ కారణంగా ఎదుటి వారి గుండెలు అదిరి ఉంటాయి అని కూడా కేసులు పెడతారు. చివరకు రామా అన్నా కేసు పెడతారు. అమ్మా అన్నా కేసు పెడతారు. ఎన్ని కేసులు పెట్టినా.. వైసీపీ మళ్లీ ఉత్తుంగ తరంగంలా లేచి తన సత్తా చాటుతుంది. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు” అని సజ్జల అలా చెప్పుకుంటూపోయారు.

వాస్తవానికి వైసీపీ జమానాలో అరాచకాలు ఓ రేంజిలో జరిగాయనే చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనిపై నాటి వైసీపీ సర్కారు ఏదో అలా కేసు నమోదు చేసేసి… ఫైల్ ను అలా అటకెక్కించింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అదికారంలోకి రాగానే.. ఆ కేసు యథాలాపంగానే తిరిగి ఓపెన్ అయిపోయింది. ఇక అప్పటికే మూడు పర్యాయాలు సీఎంగా, నాడు ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. మరి దీనిపై కేసు పెట్టాలా?వద్దా? అన్నది సజ్జలకే వదిలేయాలి.

సజ్జల అంత రాజకీయ అజ్ఞాని ఏమీ కాదు. ఎందుకంటే తెలుగు జర్నలిజంలో ఆయన ఓ పేరుమోసిన పాత్రికేయుడు. ఇప్పుడు నిత్యం దూషిస్తున్న ఈనాడు నుంచే సజ్జల తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంబించారు. ఆ తర్వాత పలు పత్రికలు మారిన ఆయన జగన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సాక్షి పత్రిక, టీవీలకు ఎడిటోరియల్ డైరెక్టర్ గా చాలా కాలం పాటు విధులు నిర్వర్తించారు. జగన్ పార్టీ పెట్టంగానే…సాక్షిని వేరే వాళ్ల చేతిలో పెట్టిన సజ్జల తాను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక వైసీపీ అదికారంలో ఉండగా… ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆయన సకల శాఖల మంత్రిగా పనిచేశారని అపవాదునూ మూటగట్టుకున్నారు.