తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికలో గెలిచినట్లే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా బీజేపీ గెలుస్తుందని ఏపి ఇన్చార్జీ సునీల్ దేవదర్ ప్రకటించేశారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశం జరిగింది లేండి. ఈ సందర్భంగా కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలనో ఏమో కానీ సునీల్ చాలా పెద్ద మాటలే మాట్లాడేశారు. ఏకంగా తిరుపతి ఉపఎన్నికలో గెలిచేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ సుమారు 2.28 లక్షల ఓట్ల మెజారిటితో గెలిచారు. అయితే అనారోగ్యం కారణంగా ఈమధ్యే మరణించారు.
ఎంపి మరణం కారణంగా ఇక్కడ ఉపఎన్నిక జరగబోతోంది. అసలు మొన్న దేశంలో జరిగిన వివిధ ఉపఎన్నికలతోనే తిరుపతి ఎన్నిక కూడా జరుగుతుందని అనుకున్నారు. అయితే ఎందుకనో జరగలేదు. మార్చిలోగా జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాబట్టే ప్రతిపక్షాలు పోటీకి ఇప్పటి నుండే రెడీ అయిపోతున్నాయి. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్ధి పోటీ చేయటమే కాకుండా ఏకంగా గెలిచేస్తామని కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర నేతలు పదే పదే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
మొన్నటి ఎన్నికల్లో గెలిచిన దుర్గాప్రసాద్ కు సుమారు 7 లక్షలకు పైగా ఓట్లొచ్చాయి. అలాగే ఓడిపోయిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 4.8 లక్షల ఓట్లు వచ్చాయి. సరే తిరుపతి ఎన్నికల్లో గెలిచేస్తామని పదే పదే భీకర ప్రకటనలు చేస్తున్న బీజేపీ అభ్యర్ధి శ్రీహరిరావుకు వచ్చిన ఓట్లు 16,125. అక్షరాల 16 వేల ఓట్ల చిల్లర మాత్రమే. గెలిచిన వైసీపీ అభ్యర్ధికి వచ్చిన 2.28 లక్షల ఓట్ల మెజారిటి ఎక్కడ బీజేపీ అభ్యర్ధికి వచ్చిన 16 వేల ఓట్లెక్కడ. చివరకు నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా) వచ్చిన ఓట్లు 27 వేలు. అంటే నోటాకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదని అర్ధమైపోతోంది.
సరే తమ అభ్యర్ధే గెలవబోతున్నాడని బీజేపీ నేతలు ఎందుకు చెబుతున్నారు ? ఓటర్ల ఆలోచనల్లో ఏమంతా మార్పులు వచ్చేసింది ? అంటే మళ్ళీ చెప్పలేకపోతున్నారు. బహుశా తెలుగుదేశంపార్టీ పోటీ చేయదనే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకునే వీర్రాజు గెలుపుపై ఆశలు పెట్టుకున్నట్లున్నారు. నిజంగానే టీడీపీ గనుక పోటీకి దూరంగా ఉంటే వాళ్ళ ఓట్లు కూడా వైసీపీకి పదే అవకాశాలున్నాయే కానీ బీజేపీకి పడతాయని, గెలిచేస్తామని ఎలా అనుకుంటున్నారో. పైగా జనసేన మద్దతుతో అంటు పెద్ద ట్యాగ్ లైన్ లాగ చెబుతున్నారు. అసలు జనసేనకున్న ఓట్లెన్ని ? ఏమిటో వాస్తవాలను మరచిపోయి ఆకాశానికి నిచ్చెనెలు వేసినట్లే ఉంది బీజేపీ నేతల మాటలు. చూద్దాం ఉపఎన్నికలో ఎవరి కెపాసిటి ఏమిటో తేలిపోతుంది కదా ?