వైసీపీని పిల్ల కాల్వతో పోలుస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌లో ఆ పార్టీ కూడా కలుస్తుందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పార్టీ కార్యక్రమం లో షర్మిల మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. అనేక పిల్లకాల్వలు.. ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే. వైసీపీ కూడా అలాంటిదే. ఏదో ఒకరోజు ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలిసి పోవాల్సిందే” అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుపై కూడా ఆమె స్పందించారు.
పోలవరంప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టుగా పేర్కొన్న షర్మిల.. ఆయన కుమారుడే ఈ ప్రాజెక్టును ధ్వంసం చేశాడంటూ.. జగన్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో పోలవరం పూర్తి చేస్తామని.. నీటిని ఇస్తామని ప్రకటించారని.. దీనిపై అసెంబ్లీలోనూ జబ్బలు చరుచుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కానీ, కాంట్రాక్టర్లను మార్చడం.. రివర్స్‌టెండర్లు నిర్వహించడంతో పోలవరం ప్రగతి పదేళ్ల వెనక్కి పోయిందని.. దీనికి ముమ్మాటికీ జగనే కారణమని వ్యాఖ్యానించారు. ఆయన హయాం లోనే పోలవరం ఎత్తును కూడా తగ్గించే ప్రతిపాదన కూడా తెరమీదికి వచ్చిందని షర్మిల దుయ్యబట్టారు.
అయితే.. కూటమి ప్రభుత్వం కూడా పోలవరం ఎత్తును తగ్గించేందుకు నాటకం ఆడుతోందని షర్మిల వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారుతో కలిమి, చెలిమి ఉందని చెబుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పోలవరాన్ని నాశనం చేస్తున్నారని.. పోలవరం ఎత్తును తగ్గిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ఎత్తును తగ్గిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని షర్మిల తెలిపారు. అంతేకాదు.. పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని షర్మిల దుయ్యబట్టారు. వారిని ఆదుకునే విషయంలో అప్పుడు జగన్ , ఇప్పుడు చంద్రబాబు కూడా విఫలమయ్యారని అన్నారు.
ఇక, కీలకమైన బనకచర్ల ప్రాజెక్టుపై స్పందించిన షర్మిల.. తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. “నేను ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని. ఇక్కడి ప్రజల మేలు నాకు ముఖ్యం. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను. బనక చర్ల విషయంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీమ వాసులకు నీళ్లు వస్తాయని అనుకుంటే.. సహకరించేందుకు సిద్ధంగానే ఉంటాను. ఈ విషయంలో తెలంగాణకు కూడా అన్యాయం జరగరాదనేది మా పార్టీ వాదన” అని షర్మిల తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates