దేశంలో 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించారు. ఈ క్రమంలో ప్రజల ప్రాథమిక హక్కులపై సర్కా రు ఉక్కుపాదం మోపింది. అనేక మంది నాయకులను అరెస్టు చేసి జైళ్లలో కూడా పెట్టారు. చిత్రం ఏం టంటే.. ఆనాటి ప్రధాని ఇందిర.. తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన వారిని కూడా జైలుకు పంపించింది. తనను వ్యతిరేకించిన వారు, ఎమర్జెన్సీని తప్పుబట్టిన వారు.. ఎంతటి వారైనా సరే.. జైల్లో మగ్గాల్సిందే అన్నట్టుగా వ్యవహరించారు. ఇలా.. అనేక అకృత్యాలు సాగాయి.
అయితే.. ప్రస్తుత ప్రధాని మోడీ ఆ నాటి ఎమర్జెన్సీని సంవిధాన్ హత్యాదివస్‌గా పేర్కొన్నారు. అంటే.. ప్రజాస్వామ్య హత్యా దినంగా ఆయన అభివర్ణించారు. తాను కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నానని.. జైల్లో కూడా పెట్టారని పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై పుస్తకాన్ని వెలువరించనున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక, దీనికి కొంత రాజకీయ రంగు ఎలానూ పులుమి.. బీజేపీ సానుకూల, కాంగ్రెస్ వ్యతిరేకత పెరిగేలా వార్షికోత్సవాలు జరగనున్నాయి.
ఇదిలావుంటే.. అసలు మోడీకి, ఎమర్జెన్సీకి సంబంధం ఏంటి? అనేది కీలకం. దేశంలో ఎమర్జెన్సీ విధించే సమయానికి మోడీ వయసు 23-24 సంవత్సరాలు. ఆయన అప్పటికే ఆర్ ఎస్ ఎస్ జన్ సంఘ్ లో సభ్యుడు. అంతేకాదు.. గుజరాత్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్ ఎస్ ఎస్ చేసిన ఉద్యమాల్లో విద్యార్థి నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాతే ఎమర్జెన్సీ వచ్చింది. దీనికి కూడా వ్యతిరేకంగా ఆర్ ఎస్ ఎస్ విద్యార్థి సంఘం ఏబీవీపీ కదం తొక్కింది.
దీనిలో గుజరాత్ విభాగానికి మోడీ కీలక నాయకుడిగా పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేసి జైల్లో కుక్కారు. అయితే.. ఇది సాధారణంగా జరగలేదు. ఎమర్జెన్సీ సమయంలోనూ.. మోడీ సహా అనేక మంది నాయకులు.. మారు వేషాల్లో రాష్ట్రంలో తిరిగి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించారు. వీటిపై తీవ్ర నిఘా పెట్టిన ఇందిరమ్మ సర్కారు.. సిక్కు వేషంలో ఉన్న మోడీని అహ్మదాబాద్ సమీపంలో అరెస్టు చేసిజైల్లో పెట్టారు. ఇదీ.. ఎమర్జెన్సీకి, మోడీకి ఉన్న సంబంధం.
Gulte Telugu Telugu Political and Movie News Updates