వైసీపీ అన్యాయాన్ని కూటమి సరిదిద్దింది!

మైనేని సాకేత్… టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఏపీ క్రీడాకారుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతడికి అర్జున అవార్డును కూడా ప్రకటించింది. అంతటి ప్రతిభావంతుడైన మైనేని… జగన్ కు మాత్రం కంటిగింపుగా కనిపించాడు. స్పోర్ట్స్ కోటాలో అతడికి గ్రూప్1 ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా అందుకు మోకాలొడ్డాడు. ఆ అన్యాయాన్ని ఇప్పుడు కూటమి సర్కారు సరిదిద్దింది. మైనేనికి గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్ కు సరిసమానమైన ఉద్యోగాన్ని ఇవ్వాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది.

జగన్ జమానాలో తనకు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చేసినట్టేనని సాకేత్ గట్టిగా నమ్మాడు. ఎందుకంటే… కేంద్రం ఇచ్చిన అర్జున అవార్డు నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో తాను ఆ పోస్టుకు అర్హుడినని అతడు విశ్వసించాడు. అయితే కారణం ఏమిటో తెలియదు గానీ జగన్ సర్కారు సాకేత్ వినతిని అసలు పరిగణనలోకే తీసుకోలేదు. చాలా కాలం పాటు వేచి చూసిన సాకేత్ ఇక తనకు ఉద్యోగం దక్కదని ఓ అంచనాకు వచ్చేశాడు. ఉద్యోగంపై ఆశలు వదులుకున్నాడు.

అయితే ఎప్పుడైతే ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కారు అధికారం చేపట్టిందో సాకేత్ లో మళ్లీ ఉద్యోగంపై ఆశలు చిగురించాయి. సమయం చూసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశాడు. జగన్ పాలనలో తనకు జరిగిన అన్యాయాన్ని అతడు లోకేశ్ కు వివరించాడు. విషయం మొత్తం విన్న లోకేశ్.. జగన్ జమానాలో అన్యాయం జరిగితే… మేం న్యాయం చేస్తామని సాకేత్ కు హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే సాకేత్ కు గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూటమి సర్కారు ఇచ్చింది.