పనిచేసే వారికే పదవులు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో అధికార కాంగ్రెస్ లో పదవుల పంచాయతీలు ఇంకా తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పాటై అప్పుడే ఏడాదిన్నర దాటిపోతున్నా… ఇంకా చాలా మంది నేతలు పదవుల కోసం నిత్యం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొందరైతే…తమకు పరిచయం ఉన్న కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పదవులను ఆశించే వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గట్టి వార్నింగే ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వారికే పదవులు దక్కుతాయని ఆయన విస్పష్ట ప్రకటన చేశారు.

ఈ మేరకు గాంధీ భవన్ లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పొలిటికల్ అఫైర్స్ కమిటి (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం గాంధీ భవన్ వద్దకు గొర్లను తీసుకుని వచ్చి మరీ గొల్ల, కుర్మలు ఆందోళనకు దిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సామాజిక సమీకరణాలతో పాటు ఆయా సామాజిక వర్గాల్లో పనిచేసే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. ఇకపై గాంధీ భవన్ ఎదుట ఈ తరహా ధర్నాలు కుదరవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

అంతటితో ఆగని రేవంత్… ఇకపై తాను రెండు జాబితాలు సిద్ధం చేసుకుని పెట్టుకుంటానని చెప్పారు. వీటిలో ఒక దానిలో పార్టీ కోసం పనిచేసే నిజమైన నేతలు, కార్యకర్తల పేర్లు ఉంటాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వారికే పదవులు దక్కుతాయని కూడా ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు. ఇక రెండో జాబితాలో పార్టీ కోసం పనిచేయని వారి పేర్లను చేరుస్తానని, ఇలాంటి వారిపై నిత్యం నిఘా ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. ఏదైనా పదవి కోరుతున్నామంటే… ఆ పదవికి తమకు అర్హత ఉందా? లేదా?అన్న విషయాన్ని ఓ సారి ఎవరికి వారు క్రాస్ చెక్ చేసుకోవాలని రేవంత్ సూచించారు. పదవులపై రేవంత్ ఇంతగా ఓపెన్ అప్ అయిపోవడంతో సమావేశం గంభీరంగా మారిపోయింది.