జగన్ పై మరో కేసు.. విచారణలు తప్పవా?

ఏపీలో విపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో 24 కేసులున్న జగన్ పై మొన్న వైసీపీ కార్యకర్త సింగయ్య మరణంపై ఓ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవలే మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందామంటూ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారుల అనుమతి లేకుండానే జగన్ నిర్వహించిన ఈ పర్యటనపై గుంటూరు లోని నల్లపాడు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లిన సమయంలో గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ ను కూడా పట్టించుకోకుండా జగన్ భారీ జనంతో గుంటూరు మిర్చి యార్డుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మిర్చి యార్డులో రైతుల మిర్చి టిక్కీలను ఇష్టారాజ్యంగా తొక్కి నాశనం చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ను విస్మరిస్తూ జగన్ అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. వీటన్నింటిపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా సోమవారం జగన్ పై కేసు నమోదు చేశారు.

జగన్ తో పాటు నాడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులపై నల్లపాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారికి 41ఏ నోటీసులు జారీ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు పిలిస్తే హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో పోలీసులు జగన్ సహా మిగిలిన నిందితులకు ఆదేశాలు జారీ చేశారు.

రాజకీయ నేతలన్నాక కేసుల నమోదు వరకు అందరికీ ఓకే గానీ… ఓ సీఎం హోదాలో ఐదేళ్ల పాటు పనిచేసిన జగన్ లాంటి నేతలను ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కోసం పిలిస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పక తప్పదు. పోలీసుల స్పీడు చూస్తుంటే.. జగన్ ను విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపై అప్పుడు విశ్లేషణలు మొదలైపోయాయి.