నా భార్య ఫోన్ నూ ట్యాప్ చేశారు: ఈటల

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, మాల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఫోన్ తో పాటు తన సతీమణి జమున ఫోన్ కూడా బీఆర్ఎస్ సర్కారు ట్యాపింగ్ చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య ఫోన్ నే కాకుండా… తన భార్య నడుపుతున్న జమున హ్యాచరీస్ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట సోమవారం హాజరైన ఈటల సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానాలు చెప్పడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వల్ల తాను ఎంతగా మనోవేదనకు గురయ్యానన్న విషయాన్ని కూడా ఆయన సిట్ అధికారులకు తెలియజేశారు. ఈ కేసును ఇంకా నాన్చకుండా త్వరగా తేల్చాలని, నిందితులను శిక్షించాలని ఆయన కోరారు.

సిట్ విచారణ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడిన ఈటల నాటి కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం విపక్షాలకు చెందిన నేతల ఫోన్లను ట్యాప్ చేయాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్ సర్కారుకే వచ్చిందని ఎద్దేవా చేశారు. 2023 ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాప్ చేసిన కేసీఆర్ సర్కారు తాము ఎక్కడ తింటున్నాం… ఎక్కడ పండుకుంటున్నాం.. ఎక్కడ తిరుగుతున్నాం… అన్న అన్ని వివరాలను సేకరించిందని ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రావుకు కన్ ఫర్డ్ ఐపీఎస్ ఇవ్వంగానే… కేసీఆర్ ఏది చెబితే… చట్టం, న్యాయం అన్న విషయాలను పక్కనపెట్టి…అన్నీ చేసుకుంటూ పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.