ప్రతిపక్ష హోదాకు సరిపడినన్ని సీట్లు కూడా దక్కించుకోలేని వైసీపీ ఇప్పటికీ తన దుర్మార్గాలను వీడలేదని, తాను అధికారంలో ఉండగా… ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఇప్పుడూ అదే చేస్తోందని జనసేనాని, ఏపీ డిప్యేటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వాస్తవ పరిస్థితిని గుర్తించి పద్దతి మార్చుకుంటే సరేనని… లేదని పిచ్చి వేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కూటమి పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతిలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శాంతిభద్రతల విషయంలో కూటమి సర్కారు రాజీ పడే ఆస్కారమే లేదని పవన్ తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా పాలన అమలు చేయాలి కాబట్టి పద్దతిగా ఉంటున్నామన్న పవన్… ఎన్నో దెబ్బలు తిని ఇక్కడిదాకా వచ్చామన్న విషయాన్ని వైసీపీ నేతలు మరిచిపోరాదని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలని చూస్తే..సహించేది లేదని కూడా పవన్ వార్నింగ్ ఇచ్చారు. గడచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందన్న పవన్…దానిని తుదముట్టించేందుకు తామందరం ఏకమయ్యామని చెప్పారు. మూడు పార్టీల లక్ష్యాన్ని ప్రజలు కూడా గుర్తించి కూటమి కి అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
గడచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోగా.. దానిని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని పవన్ అన్నారు. ఇక బాబు కృషికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు మెండుగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొనేలా చేశామని ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులను పెంచామన్న పవన్… పల్లె పండుగ ద్వారా పల్లె సీమలకు సుందరమైన రహదారులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ దిశగా తనకు అటు మోదీ నుంచి, ఇటు చంద్రబాబు నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని పవన్ చెప్పుకొచ్చారు.
గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనను చూస్తే తన లాంటి వారికే భయం వేసిందని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న పవన్.. నాటి ప్రభుత్వ దమన నీతికి అధికారులు కూడా గడగడలాడే వారని ఆయన పేర్కొన్నారు. చివరకు సీఎం చంద్రబాబును కూడా నాటి పాలకులు అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో సహా తమను వారు అనేక ఇబ్బందులకు గురి చేశారని పవన్ అన్నారు. ఆ తరహా పాలన చూశాక ఇక ఏపీకి వెలుగు వస్తుందా? అన్న అనుమానం కలిగిందన్నారు. కూటమి సర్కారు అధికారంలోకి రాకపోయి ఉంటే… ఏపీ ఏమైపోయి ఉండేదోనన్న ఆందోళన ఇప్పటికీ తనను వేధిస్తూనే ఉందని పవన్ చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates