వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో అమరావతి రాజధానిని “వేశ్యల రాజధాని” అంటూ చేసిన తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అప్రూవర్‌గా మారేందుకు అనుమతి కోరారు. “ఉన్నది చెప్పేస్తా. నన్ను వదిలేయండి!” అని పోలీసుల ముందు ఆయన వేడుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును మూడు రోజుల పాటు అమరావతిలోని తుళ్లూరు పోలీసులు విచారించారు.
అయితే మొదటి రోజు ఆయన సమాధానాలు తప్పించుకునేలా ఉన్నా, రెండో మరియు మూడో రోజుల్లో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఆయన మారిపోయారు. “జరిగింది చెప్పేస్తా. అమరావతి అక్కచెల్లెమ్మలకు క్షమాపణలు చెబుతా. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేస్తా. నన్ను అప్రూవర్‌గా మారనివ్వండి. ఈ మేరకు అవకాశం ఇవ్వండి” అని కృష్ణంరాజు తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణను వేడుకున్నట్టు సమాచారం.
ముఖ్యంగా మూడో రోజు ఆదివారం జరిగిన విచారణలో ఆయన దాదాపు అసలు విషయాలు చెప్పారు.
“నాకు స్వతహాగా గుర్తింపు లేదు. కానీ గతంలో చంద్రబాబు నన్ను ఇబ్బంది పెట్టారు. ఓ పత్రికలో పనిచేస్తున్న సమయంలో (1995-2004లో) ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాను. దీంతో నన్ను ఉద్యోగంలో ఇబ్బంది పెట్టారు. అప్పటి నుంచి యాంటీ అయ్యాను. తరచుగా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాశాను. దీనిని సాక్షి యాజమాన్యం అనుకూలంగా మార్చుకుంది. నా బలహీనతను గుర్తించి పావుని చేసింది. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. సాక్షి నన్ను ఎలా వాడుకుందో అన్నింటిని బయట పెడతా” అని కృష్ణంరాజు తెలిపారు.
అంతేకాదు, “అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడానికి ముందురోజు సాక్షి నుంచి కొంత ముడి సరుకు అందింది. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఇందులో నా తప్పు ఉన్నా, క్షమాపణలు చెబుతున్నాను” అని కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షి మీడియా పై పోలీసులు మరింత బలమైన చట్టాలతో కేసును తిరిగి నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కృష్ణంరాజు కూడా అప్రూవర్‌గా మారేందుకు పిటిషన్ వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates