వైసీపీ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వసూలు చేసిన నగదును విదేశాలకు తరలించే ప్రక్రియలో చెవిరెడ్డి పాత్ర ఉందన్నది ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు(సిట్) చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ‘విచారణకు రా బాబూ’ అంటూ.. నోటీసుల్లో పేర్కొన్నారు. 32 సంవత్సరాల మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించారని సిట్‌కు ఆధారాలు అందాయి. ఇతర దేశాల్లో ఆయన ఈ విషయంపై కొన్ని ‘సర్దుబాట్లు’ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కూడా ఈ కేసులో ఏ39గా పేర్కొన్నారు. తాజాగా సోమవారం ఉదయం ఆయనకు నోటీసులు ఇచ్చారు.
ముందే ఊహించి..
అయితే.. సిట్ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం ఖాయమని మోహిత్ రెడ్డి ముందుగానే ఊహించారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో పాటు.. తనపై సిట్ నమోదు చేసిన కేసును కూడా కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. ఇంతలోనే సిట్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. మోహిత్ రెడ్డి నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారా? ఈ లోగా కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా? అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates