సూడో సెక్యూల‌రిస్టుల‌ను ఏకి ప‌డేసిన ప‌వ‌న్

ఈ మ‌ధ్య జ‌న‌సేనాని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురంచి చాలా గ‌ట్టిగా మాట్లాడుతూ.. సెక్యూల‌రిజం పేరుతో హిందూ మ‌తాన్ని త‌క్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి సూడో సెక్యూల‌రిస్టుల తీరును బ‌లంగా ఎండ‌గ‌ట్టాడు. త‌మిళ‌నాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న ప‌వ‌న్.. త‌న ప్ర‌సంగంతో భారీగా హాజ‌రైన జ‌నాలను ఉర్రూత‌లూగించాడు. పూర్తిగా త‌మిళంలో ఆయ‌న ప్ర‌సంగం సాగ‌డం విశేషం. త‌మిళ సంప్ర‌దాయ దుస్తుల్లో ఈ స‌భకు హాజ‌రైన‌ ప‌వ‌న్.. స్టేజ్ మీదికి రాగానే స‌భా ప్రాంగ‌ణం హోరెత్తింది. త‌మిళ‌నాడు బీజీపీ అగ్ర నేత అన్నామ‌ళైతో పాటు చాలామంది స్వామీజీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇక త‌న ప్ర‌సంగంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. మ‌న దేశంలో సెక్యూల‌రిజం ముసుగులో అంద‌రూ హిందూ మ‌తం మీద దాడి చేసేవాళ్లే అని వ్యాఖ్యానించారు. మిగ‌తా ఏ మ‌తంలోని దేవుళ్ల జోలికీ వీళ్లు వెళ్ల‌ర‌ని.. కానీ హిందూ దేవుళ్ల గురించి మాత్రం ఎలా ప‌డితే అలా మాట్లాడ‌తార‌ని ప‌వ‌న్ అన్నాడు. అన్ని మ‌తాల‌నూ ఒకే ర‌కంగా చూడ‌డం సెక్యూల‌రిజం అవుతుంద‌ని.. అలా కాకుండా ఒక మ‌తం విష‌యంలో మాత్రం భిన్నంగా మాట్లాడితే అది సూడో సెక్యూల‌రిజ‌మే అని ప‌వ‌న్ అన్నాడు. ఇత‌ర మ‌తాల దేవుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు.

హిందూ మ‌తం గురించి, దేవుళ్ల గురించి వాళ్లు ఏం మాట్లాడినా జ‌నం బాధ ప‌డ‌కూడ‌ద‌ని, కోపం రాకూడ‌ద‌ని.. బాధ‌, కోపం క‌లిగిందంటే అవ‌త‌లి వాళ్లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గురించి మాట్లాడ‌తార‌ని.. ఇది ఎలా ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అవుతుంద‌ని ప‌వ‌న్ స్పందించాడు. దేశంలో ఈ ప‌రిస్థితి మారాల‌ని.. హిందూ మ‌తం గురించి, స‌నాత‌న ధ‌ర్మం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ్డం క‌ట్టి పెట్టాల‌ని.. అందుకోసం హిందువులంతా క‌లిసి రావాల‌ని.. సూడో సెక్యూల‌రిస్టుల‌కు బుద్ధి చెప్పాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చాడు. ఆయ‌న ప్ర‌సంగానికి స‌భ‌లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది.