‘చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మోదీకే సాధ్యం’

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నింటా యోగాసనాలు వేస్తూ జనం ఉల్లాసంగా కనిపించారు. ఇక యోగా దినోత్సానికే నాందీ పలికిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం 11న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకున్నారు. ఇందుకోసం శుక్రవారమే విశాఖ చేరుకున్న మోదీ… శనివారం ఉదయమే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రముఖులతో కలిసి యోగా దినోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతే అయినా… దానికి ఇంతలా ప్రాచుర్యం తీసుకొచ్చింది మాత్రం మోదీనే అని చెప్పారు. చరిత్రను సృష్టించాలన్నా…దానిని తిరగరాయాలన్నా ఒక్క మోదీకి మాత్రమే సాధ్యమని బాబు అన్నారు. ప్రపంచం జూన్ 21న యోగాను ఓ పండుగలా జరుపుకుంటున్నారంటే దానికి మోదీనే కారణమని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. యోగా వేడుకల్లో ఇప్పటికే పలు రికార్డులు నమోదు కాగా… ఏటికేడు ఆ రికార్డులన్నీ మోదీ వల్లే బద్దలు అవుతున్నాయని ఆయన చెప్పారు.

యోగా సంపూర్ణ ఆరోగ్యానికి ఆయువుపట్టు అన్న విషయాన్ని ఎందరో మహర్షులు చెప్పినా… అంతగా పట్టించుకోని జనం… యోగాను ఆచరిద్దాం… ఆరోగ్యంగా ఉందామంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు మాత్రం ఓ రేంజి మద్దతు లభించిందని చంద్రబాబు అన్నారు. అలాంటి మోదీ 11 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ రావడం, ఇక్కడి నుంచే యోగా దినోత్సవాన్ని మోదీ ప్రారంభించడం ఏపీ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన యోగాసనాల్లో విశాఖ జనం తండోపతండాలుగా పాలుపంచుకోవడంతో బీచ్ మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది.