తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం కరీంనగర్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
సిరిసిల్లతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేంద్రం హైదరాబాదులోనూ ఉందన్నారు. ఐపీఎస్ ప్రభాకర్‌రావు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. చివరకు న్యాయ మూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నది తన డిమాండ్‌గా ఆయన పేర్కొన్నారు. ‘పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.’ అని బండి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కోర్టు ఆదేశాలతో భారత్‌కు తిరిగి వచ్చారని.. అయితే.. అదే రోజు మాజీ మంత్రి కేటీఆర్.. అమెరికాకు ఎందుకు వెళ్లారని బండి నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనీసం ఇంత వరకు వచ్చిందంటే దానికి తానే కారణమని బండి వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పలు సంసారాలను పాడుచేశారని.. అనేక మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేశారని వ్యాఖ్యానించారు.
‘ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నాకు సమాచారం ఉంది. అలాంటి ప్రభాకర్‌రావుకు ఇప్పుడు రాచమర్యాదలు చేసి పువ్వును చూసినట్టు చూస్తున్నారు. బలంగా ప్రశ్నించడం లేదు. ఇలాంటి వాటిని ఆపేయండి గట్టిగా ప్రశ్నించండి’ అని బండి సూచించారు. గతంలో తనను అరెస్టు చేయడం వెనుక ప్రభాకర్ రావు ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను, రాష్ట్ర ప్రజల జీవితాలను కూడా సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. కాగా.. ఇటీవల బండి సంజయ్‌కు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తుబృందం అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. సిట్ అధికారుల విచారణకు హాజరు అవుతానని , తనకు తెలిసింది చెబుతానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates