ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోయారు. బాబు మీతో మాట్లాడతారని చెప్పి… విశాఖకు చెందిన ఓ వ్యక్తిని బుట్టలో వేసేసిన సైబర్ నేరగాళ్లు.. బాదితుడి ఫోన్ కు ఏఐ సాయంతో బాబుతోనే మాట్లాడించారు. ఇంకేముంది… స్వయంగా సీఎం చంద్రబాబే తనతో మాట్లాడారన్న భావనతో వ్యక్తి సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బు ఇస్తూ పోయారు. రూ.80 వేల మొత్తాన్ని చెల్లించుకున్న తర్వాత గానీ ఆ బాధితుడికి తాను మోసపోయానని తెలియలేదు.
అందరినీ షాక్ కు గురి చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… విశాఖకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఓ భూవివాదం పరిష్కారం నిమిత్తం తన వంతు యత్నాలు సాగించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు ఓ హైటెక్ సైబర్ మోసానికి తెర తీశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ తోనూ మాట్లాడి మీ సమస్యను ఇట్టే పరిష్కరిస్తామని నిందితులు చెప్పడంతో రెడ్డి నమ్మేశారు. వారు అడిగిన మేర సొమ్మును చెల్లిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ఓ సారి చంద్రబాబు పిక్ తో కూడిన వాట్సాప్ కాల్ రెడ్డి ఫోన్ కు వచ్చింది. ఆ ఫోన్ నేరుగా చంద్రబాబు నుంచే వచ్చిందన్న భావనతో రెడ్డి సంభ్రమాశ్యర్యాలకు గురి అయ్యారు. ఏఐ సాయంతో నిందితులు చేసిన ఈ ఫోన్ కాల్ లో చంద్రబాబు ఫొటోతో పాటు చంద్రబాబు వాయిస్ కూడా అచ్చుగుద్దినట్టుగా సరిపోయింది. దీంతో రెడ్డి తన సమస్యను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల వద్దకూ వెళ్లానని, అయినా తనకు న్యాయం జరగలేదని ఆయన వాపోయారు. ఈ క్రమంలో అంతా తాను చూసుకుంటానని బాబు వాయిస్ వినిపించగానే రెడ్డి అతిశయానికి గురయ్యారు.
తీరా ఎన్ని రోజులు అయినా తన సమస్య పరిష్కారం కాకపోవడం, నేరుగా చంద్రబాబు ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చినా పని కాకపోవడంతో రెడ్డికి ఓ మోస్తరు అనుమానం వచ్చింది. వెంటనే తన మిత్రులతో ఈ విషయం చెప్పగానే వారంతా… ఇదేదో మోసంగానే ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రెడ్డి నేరుగా పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా రెడ్డి చెప్పడంతో హైటెక్ స్థాయి భారీ సైబర్ మోసం జరిగినట్లు పోలీసులు తేల్చారు. రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates