ముద్ర‌గ‌డ‌తో వంగ‌వీటి కుమార్తె భేటీ?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో ప్ర‌ముఖ నాయ‌కుడు, దివంగత వంగ‌వీటి రంగా కుమార్తె.. ఆశా కిర‌ణ్ భేటీ అయ్యార‌న్న వార్త ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. గ‌త ఏడాది మ‌ధ్య‌లో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు.. ఆశా కిర‌ణ్ మీడియా ముందు ప్ర‌క‌టించారు. అయితే.. స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ముందు ప్ర‌జా క్షేత్రంలోకి అడుగు పెడ‌తాన‌ని.. త‌ర్వాత రాజ‌కీయాలవైపు వ‌స్తాన‌ని ఆమె అప్ప‌ట్లో చెప్పారు.

ఆ త‌ర్వాత‌.. రంగా వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ నుంచి ర్యాలీగా విశాఖ‌కు వెళ్లారు. అక్క‌డ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కానీ, ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు వంగ‌వీటి ఆశా కిర‌ణ్ వార్త‌లు కానీ.. ఆమె రాజ‌కీ యాగాలు లేదా సేవా రంగం గురించి కానీ.. ఎక్క‌డా ప‌న్నెత్తు మాట వినిపించ‌లేదు. దీంతో ఇక‌, ఆశా కిర‌ణ్‌.. తెర‌మ‌రుగు అయ్యార‌న్న చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే.. హ‌ఠాత్తుగా మ‌ళ్లీ ఆశా కిర‌ణ్ గురించిన వార్త‌లు.. గోదావ‌రి జిల్లాల్లో హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ముద్ర‌గ‌డ స‌ల‌హాలా?

అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. గత వారం ఆశా కిర‌ణ్.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నివాసానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఆయ‌న‌తో సుమారు గంట సేపు ఆమె చ‌ర్చించార‌ని.. త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపైనే ఆమె ఇంత దూరం వ‌చ్చి.. ప‌ద్మ‌నాభంతో భేటీ అయి ఉంటార‌ని.. ప‌లువురు కాపునాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ సాగుతుండ‌డం కూడా ఈ వాద‌నకు బ‌లాన్ని చేకూర్చింది. అయితే.. అటు ముద్ర‌గ‌డ కానీ.. ఇటు ఆశా కిర‌ణ్‌కానీ.. ఎక్క‌డా ఈ విష‌యంపై మాట్లాడలేదు.

గ‌తంలోనూ ప‌లువురు కాపు నాయ‌కులు ముద్ర‌గ‌డ‌ను క‌లుసుకుని, చ‌ర్చించిన త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరారు. ఇలానే.. ఏదో వ్యూహాత్మ‌క కార‌ణంతోనే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని ఆశా క‌లిసి ఉంటార‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్న ద‌రిమిలా.. ఆమెను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నించింది. కానీ.. అప్ప‌టికి ఆశా కిర‌ణ్‌.. స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితమ‌య్యారు. ఇప్పుడు వైసీపీ వైపు ఆమె అడుగులు వేసేందుకు.. తొలి గేట్ వేగా ముద్ర‌గ‌డ‌ను ఎంచుకున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఈ విష‌యం ప్ర‌స్తుతం గోదావ‌రి పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.