గత ఏడాది బాహుబలి రెండు భాగాలను సింగల్ పార్ట్ గా మార్చి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 3 గంటల 44 నిమిషాల సుదీర్ఘ నిడివిని ప్రేక్షకులు మనసారా ఎంజాయ్ చేశారు. రాజమౌళి విజువల్ గ్రాండియర్, ప్రభాస్ విశ్వరూపం, కీరవాణి అదిరిపోయే సంగీతం, పోటీ పడుతూ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యాస్టింగ్ ఇవన్నీ చూసిన వాళ్లకు మర్చిపోలేని అనుభూతినిచ్చింది. కట్ చేస్తే ఇదంతా జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే బాహుబలి ది ఎపిక్ ని ఓటిటిలో చూద్దామంటే ఎక్కడా కనిపించడం లేదు. అసలు ట్విస్ట్ ఇది కాదు. నెట్ ఫ్లిక్స్ లో కేవలం హిందీ వెర్షన్ అందుబాటులో ఉంచారు. ఇటీవలే జపాన్ లో ఒరిజినల్ బ్లూ రే డిస్క్ విడుదల చేశారు. మొత్తం సినిమాతో పాటు మేకింగ్ అఫ్ బాహుబలి అంటూ ఒక స్పెషల్ డిస్క్ అదనంగా ఇచ్చారు. తెలుగు డీటీఎస్ ఆడియోని పొందుపరిచారు. ఆల్రెడీ ఆ దేశంలో అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ మన దగ్గర మాత్రం రాలేదు.
శాటిలైట్, ఓటిటి హక్కులు ప్రత్యేకంగా హాట్ స్టార్ కు అమ్మడం వల్ల సాంకేతికంగా ఎపిక్ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తేలేదని సమాచారం. దీంతో ఆన్ లైన్ లో అనధికారికంగా జపాన్ ప్రింట్ ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న ఫ్యాన్స్ లేకపోలేదు. అయినా ప్రతి సినిమా ప్రతిసారి థియేటర్లలోనే చూడటం సాధ్యం కాదు కాబట్టి వీలైనంత వరకు ఓటిటిలో అందుబాటులోకి తేవడం చాలా అవసరం. అందుకే బాహుబలి ఎపిక్ గురించి చెప్పాల్సి వచ్చింది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర డివిడి, బ్లూరే లాంటి ఫిజికల్ డిస్కులకు కాలం చెల్లిపోయింది కానీ అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో ఇంకా వీటికి ఆదరణ ఉంది. చందాలు కట్టి చూడటం కంటే డిస్క్ కొని శాశ్వతంగా సొంతం చేసుకోవాలని కోరుకునే ఆడియన్స్ అక్కడ భారీగా ఉన్నారు. ఎపిక్ ఒకటే కాదు పుష్ప 2, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ, కల్కి, కెజిఎఫ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇప్పటికీ జపాన్ లో బ్లా రే రూపంలో కొనుక్కుని దాచుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
