రాష్ట్రంలో యోగాంధ్ర సక్సెస్ వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని.. ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. “సమాజంలోని అనేక వర్గాలను ఏకం చేయడం ద్వారా.. ఒకటిన్నర నెలల కాలంలో.. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ కు ప్రత్యేక అభినందనలు” అని వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ చేసిన కృషి.. దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఒక నమూనాగా ఉంటుందని ప్రధాని తెలిపారు. ప్రపంచ దేశాలను, వ్యక్తులను యోగా ఏకం చేసిందని పేర్కొన్నారు. పది సంవత్సరాల కిందట అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 175 దేశాల్లో యోగా సాధన చేయడంతోపాటు.. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు.
యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియగా ప్రధాని పేర్కొన్నారు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని, గ్రామగ్రామాల్లో యువకులు కూడా యోగాను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎక్కువగా నారా లోకేష్‌ను మోడీ ప్రస్తావించడం గమనార్హం. ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాల విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీనిని సక్సెస్ చేయడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates