పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును సమర్థిస్తూ… దానిని ఇమిటేట్ చేస్తూ వైసీపీ అథినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఓ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి… ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్న జగన్ నేరస్తులను, నేర స్వభావాన్ని వెనకేసుకుని వస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్ననే ఘాటుగా స్పందించారు. తాజాగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… జగన్ పేరెత్తకుండానే ఆయన వ్యాఖ్యలను ఖండించడంతో పాటుగా ఆయనకు ఓ గట్టి హెచ్చరిక అయితే జారీ చేశారు.
ఓ సినిమా నటుడిగా తనకున్న అనుభవాన్ని రంగరించి మరీ పవన్ జగన్ కు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాల్సి ఉందని పవన్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని కూడా పవన్ గుర్తు చేశారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయన్న పవన్.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనన్న పవన్.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. అలాంటివారిపై తప్పనిసరిగా రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని తెలిపారు. అశాంతిని, అభద్రతను కలిగించేవారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్నవారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన పవన్.. వారిని జనం ఓ కంట కనిపెట్టాలని సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా – వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దంటూ కూడా పవన్ హెచ్చరించారు.
ఈ ప్రకటన ద్వారా పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ శ్రేణులకు కూడా గట్టి హెచ్చరికలే జారీ చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఇకపై జగన్ ర్యాలీల్లో గానీ, సభల్లో గానీ విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ప్లకార్లులు పట్టుకోవడం గానీ, ఆ తరహా నినాదాలు చేయడం గానీ చేస్తే సహించేది లేదని కూడా పవన్ ఓ గట్టి వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించని పవన్… అన్ని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సాగారు. దీంతో జగన్ పేరెత్తకుండానే జగన్ తో పాటు వైసీపీ శ్రేణులకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates