ఉచిత‌మే అయినా.. మ‌హిళ‌ల కోసం కొత్త బ‌స్సులు: మ‌న‌సు పెట్టిన‌ బాబు

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. టీడీపీ ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి మేనిఫెస్టోలోనూ.. సూప‌ర్ 6 హామీల్లోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ప్ర‌ధానంగా ప్ర‌క‌టించింది. తాజాగా కొన్ని రోజుల కింద‌ట‌.. సీఎం చంద్ర‌బాబు దీనిపై ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని చేరువ చేస్తున్న‌ట్టు చెప్పారు. నెల‌కు సుమారు 30 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు.. స‌ర్కారుపై భారం ప‌డుతుంద‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ మ‌హిళామ‌ణుల‌కు తాము ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఉచిత బ‌స్సే క‌దా.. అని సీఎం చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు కేటాయించే బ‌స్సుల‌పై చిన్న చూపు చూడ‌లేదు. రాష్ట్రంలో అమ‌ల‌య్యే ఉచిత బ‌స్సు ప‌థ‌కం కోసం.. నేరుగా కొత్త బ‌స్సుల‌ను కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా.. ఎల‌క్ట్రిక్ బ‌స్సులే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఆ బ‌స్సులు ఎక్కిన వారికి ఒక స‌రికొత్త అనుభూతి క‌లుగుతుంది. క‌నీసం.. బ‌స్సు వెళ్తోందా? అనే అనుమానం కూడా వ‌స్తుంది. ఎందుకంటే ఎల‌క్ట్రిక్ బ‌స్సుల ఇంజ‌న్లు పెద్ద‌గా శ‌బ్దం చేయ‌వు. పైగా సౌక‌ర్యాలు కూడా మ‌రిన్ని ఎక్కువ‌గా ఉంటాయి.

తాజాగా `పీఎం-ఈ-బ‌స్ సేవ‌`  పథకం కింద కేంద్రం సమకూర్చే ఎలక్ట్రిక్‌ బస్సులను కొనాల‌ని సీఎం చంద్ర‌బాబు ర‌వాణా శాఖ‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఏపీకి రానున్నాయి. ఈ బ‌స్సుల‌ను ఎందుకు కొనుగోలు చేస్తున్న‌దీ..  ప్రతిపాదనలు రూపొందించేందుకు  రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని నియమించారు. ఈ క‌మిటీ నివేదిక‌ను 15 రోజుల్లోనే ఇవ్వ‌నుంది. ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు మ‌రో 50 రోజుల స‌మ‌యం ఉంది. సో.. అప్ప‌టిలోగానే కేంద్రం నుంచి కొత్త బ‌స్సులు తీసుకువ‌చ్చి.. మ‌హిళ‌ల‌కు కేటాయించాల‌ని సీఎం చంద్ర‌బాబు చూస్తున్నారు. వీటిని కేంద్రం రాయితీపై రాష్ట్రాల‌కు అందిస్తున్న విష‌యం తెలిసిందే.