వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసుల్లో పెట్టిన సెక్షన్లు గమనిస్తే.. ఆయనకు కనీసం ఏడేళ్లు తక్కువ కాకుండా శిక్షలు పడేలా ఉండడం గమనార్హం. దీంతో ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసేందుకు పోలీసులకు అవ కాశం ఏర్పడింది. బుధవారం వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో అంబటి రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లను తోసిపుచ్చారు. ఆయన సోదరుడు అంబటి మురళి కూడా ఈ కార్యక్రమంలో రెచ్చిపోయారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూనే.. మరోవైపు బారికేడ్లను తోసి విసిరేశారు. వాస్తవానికి ఆ సమయంలో పోలీసులు కొంత మేరకు సంయమనం పాటించారు. అయితే.. జగన్ వస్తున్న ఊపులో ఉన్న వైసీపీ నాయకులు పోలీసులను సైతం లెక్క చేయలేదు. ఈ క్రమంలోనే ఇష్టానుసారంగా వ్యవహరించారు.
దీంతో ఇవన్నీ రికార్డు చేసుకున్న పోలీసులు.. గురువారం ఉదయం వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలతో బ్యానర్లు ప్రదర్శించిన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఏటుకూరు వద్ద జరిగి ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో జగన్ కాన్వాయ్ సిబ్బందిపైనా కేసులు నమోదు చేశారు.
మొత్తంగా వైసీపీ అధినేత చేసిన ఒక్క పర్యటనకు సంబంధించి పల్నాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మంది కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఒక్కొక్క కేసులో 20 నుంచి 30 మంది కార్యకర్తలు ఉన్నారు. ఇక, నాయకుల విషయానికి వస్తే.. ఒక్కొక్కరు సెంట్రిక్‌గా వారు చేసిన తీరును బట్టి కేసులు కట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates