వారికి వాయిస్ లేకుండా పోయింది!

నాయ‌కుడు అన్నాక‌.. మీడియాతో అనుబంధం ఉంటుంది. నాయ‌కులకు-మీడియాకు మ‌ధ్య అవినాభావ సంబంధం కూడా పెరిగిపోయింది. ఎంత సేపూ.. మీడియా ముందు ఉండాల‌నే నాయ‌కులు కోరుకుంటారు. అవ‌స‌రం వ‌స్తే.. అదే ప‌నిగా మీడియా ముందు కూర్చునే నాయ‌కులు కూడా.. ఏపీలో బాగానే ఉన్నారు. మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. సంచ‌ల‌నాలు సృష్టించాల‌ని బావించే వారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరికి ప‌నిలేకుండా పోయింది.

ముఖ్యంగా టీడీపీలో నాయ‌కులు ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, గంటా శ్రీనివాస‌రావు వంటి వారు ఏం మాట్లాడినా .. సంచ‌ల‌నాలు సృష్టిస్తాయి. వారికి ఉన్న ఇమేజ్ అలాంటింది. దీంతో గ‌తంలో వారు త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చేవారు. ఏదో ఒక విష‌యంపై వారు ప్ర‌స్తావ‌న చేసేవారు. కానీ, గ‌త ఏడాది కాలంలో వీరు పెద్ద‌గా మీడియా ముందుకు వ‌చ్చిన దాఖ‌లా లేకుండా పోయింది.

ఈ విష‌యంలో పార్టీ అధిష్టానం నుంచి బ‌లమైన సంకేతాలు వ‌చ్చాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏది ఉన్నా.. ముందుగా త‌మ‌కు చెప్పి.. ఆ త‌ర్వాతే.. మీడియా ముందుకు రావాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో చాలా మంది ఫైర్ బ్రాండ్లు రావ‌డ‌మే మానేశారు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. పార్టీ నిర్దేశించిన అంశాల‌పై మాత్ర‌మే మాట్లాడాల‌ని తేల్చి చెప్పారు. దీంతో ఆ నిర్దేశిత అంశాల‌పైనే మాట్లాడుతున్నారు. దీంతో వారు స‌రైన రీతిలో ప్రొజెక్టు కాలేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై వైసీపీ కీల‌క విమ‌ర్శ‌లు చేసింది. ఈ ప‌థ‌కంలో మిన‌హాయించుకుం టున్న రూ.2000లు మంత్రినారా లోకేష్ ఖాతాలోకి చేరుతున్నాయ‌ని విమ‌ర్శించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దాడి చేయాల‌ని పార్టీ ఆదేశించింది. దీంతో కొంద‌రు నాయ‌కులు మీడియా ముందుకు వ‌చ్చారు. ఇది మిన‌హా .. ఇత‌ర విష‌యాల‌పై వారు మాట్లాడే అవ‌కాశం లేకుండా పోయింది.

అయితే.. ఇలా చేయ‌డం స‌రికాద‌ని.. బ‌ల‌మైన వాయిస్‌ను పార్టీ వినియోగించుకోవాల‌ని సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. పైగా మంత్రుల డామినేష‌న్‌తో కూడా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఎలా చూసినా.. దీనిపై మ‌రోసారి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవాల‌న్న సూచ‌న‌లు వినిపిస్తున్నాయి.