దేశ, విదేశాల నుంచి తిరుమల వచ్చే భక్తులు విమానాలను ఆశ్రయించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతికి వచ్చే విమానాలు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి వస్తున్నాయి. ఇదే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాశ్రయం. ఇక్కడ దిగి 15 కిలో మీటర్ల దూరంలోని తిరుపతికి రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు. అయితే.. సుదీర్ఘకాలంగా ఉన్న రేణిగుంట విమానాశ్రయం పేరును తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ‘శ్రీవేంకటేశ్వర విమానాశ్రయం’గా మార్పు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర పౌరవిమానయాన శాఖకు పంపనుంది.
ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ అయిన పాలక మండలి తీర్మానం చేసింది. తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టుగా నామకరణం చేసినట్టు నాయుడు చెప్పారు. ఈ తీర్మానాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి స్థలాన్ని ఇవ్వడానికి సుముఖంగా ఉందని తెలిపారు. త్వరలోనే ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలానే.. తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రానున్నట్టు చెప్పారు.
కేంద్రమంత్రి, కర్ణాటకకు చెందిన మాజీ సీఎం కుమార్ స్వామి ‘సెంట్రల్ ఫండ్’ ద్వారా ఈ 100 ఎలక్ట్రికల్ బస్సులు ఉచితంగా తిరుమలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నాయుడు చెప్పారు. వాటిని తీసుకురావడానికి తీర్మానం చేశామన్నారు. సి ఎస్ ఐ ఆర్ ల్యాబ్ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని త్వరలోనే ల్యాబ్ ఏర్పాటుకు స్థలాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. 1952లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల భవనాల పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మం వ్యాప్తి కోసం టిటిడి ధర్మ ప్రచార పరిషత్ కు ఏడాదికి 120 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
తిరుమల ఆధ్వర్యంలో నడిచే.. ‘శ్రీ వాణి ట్రస్ట్’ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడానికి తీర్మానం చేసినట్టు నాయుడు వివరించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో 141 ఆలయాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించినట్టు చెప్పారు. టిటిడి కళాశాలలో ఏళ్ల తరబడి లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. అన్న ప్రసాదాలు సహా.. పవిత్ర లడ్డూ ప్రసాదాలను కూడా నాణ్యతమేరకు తయారు చేయించి భక్తులకు అందిస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates