‘కుప్పం’ ఘటనపై కఠిన చర్యలకు బాబు, అనిత ఆదేశం

అప్పు తీర్చలేదన్న కారణంగా ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఏపీలో పెను కలకలమే రేపింది. ఈ ఘటన సాక్షాత్తు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడంతో ఈ ఘటనకు చెందిన వీడియోలు మరింత వైరల్ గా మారాయి. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా వేగంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారిద్దరూ నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు.

ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో కుప్పం పోలీసులు రంగంలోకి దిగి శిరీషను ఆసుపత్రికి తరలించారు. మునికన్నప్ప కుటుంబంపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెనువెంటనే ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. మహిళను వేధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగొద్దంటూ సూచించారు.

ఇక ఈ విషయంపై స్పందించిన హోం మంత్రి అనిత నేరుగా బాధితురాలు శిరీషతో ఫోన్ లో మాట్లాడారు. భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు. దాడికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అనిత హామీ ఇచ్చారు. ఇటు సీఎం, అటు హోం మంత్రి స్పందనలతో కుప్పం పోలీసులు మునికన్నప్ప కుటుంబ సభ్యులపై ఏకంగా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి మునికన్నప్ప, ఆయన భార్య, ఆయన కుమారుడు, కోడలును అరెస్టు చేశారు.