23 ముహూర్తం.. అస‌లు విష‌యాలు తేలేది అప్పుడే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓ కీల‌క కార్య‌క్ర‌మానికి ఈ నెల 23ను ముహూర్తంగా నిర్ణ‌యించారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ఈ ఏడాది కాలంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, చేసిన సంక్షేమం వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు.ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 23 నుంచి ‘ఇంటింటికీ సుప‌రిపాల‌న‌’ పేరుతో ప్ర‌చారం చేయాల‌ని ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

ఇది మంచి నిర్ణ‌య‌మే. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు.. ప్ర‌చారం చేసుకోవ‌డం అనేది త‌ప్పుప‌ట్టాల్సి న అవ‌స‌రం లేదు. పైగా దేశ‌వ్యాప్తంగా కూడా.. ప్ర‌భుత్వాలు ఇప్పుడు ఏటికేడు ప్ర‌జాద‌ర‌ణ‌పై జాగ‌రూక‌త‌తో నే ఉంటున్నాయి. ప్ర‌జ‌ల నాడి తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ‌తంలో వైసీపీ కూడా.. ఇలానే ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు’పేరుతో ఎమ్మెల్యేలు మంత్రుల‌ను పంపించి.. ప్ర‌భుత్వ తీరును తెలుసుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే బాట ప‌ట్టారు.

అయితే.. అస‌లు విష‌యాలు అనేవి ఇప్పుడు తెలుస్తాయి. ఈ కార్య‌క్ర‌మం పైకి చెప్పుకొన్నంత ఈజీ అయి తే కాదు.. సంతృప్తి-అసంతృప్తుల బేరీజులో.. అత్యంత కీల‌క‌మైన కార్య‌క్ర‌మం. దీంతో ప్ర‌జ‌లు ఏమ‌నుకుం టున్నారు..? ఎలా స్పందిస్తున్నారు? అనేది ఇప్పుడు స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఎవ‌రినీ ఎవ‌రూ మోసం చేసేందుకు అవ‌కాశం లేని విధంగా ప్ర‌జ‌ల స్పంద‌న తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇసుక మ‌ద్యం వ్య‌వ‌హారాల‌పై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు. దీనిని ఎంత దాస్తే.. అంత చేటే.

ఈ విష‌యాల‌తోపాటు.. సంక్షేమం ఎంత మందికి అందుతోందో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. ఎమ్మెల్యే ల ప‌నితీరుకు ప్ర‌జ‌లే అద్దం ప‌డ‌తారు. అయితే..ఇవ‌న్నీ తెలియ‌డం గొప్ప విష‌యం కాదు.. తెలిసిన త‌ర్వాత‌.. లోపాలు స‌రిదిద్దుకోవ‌డ‌మే అస‌లు కీల‌కం. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వానికి కూడా లోపాలు తెలిసి వ‌చ్చాయి. కానీ, మార్పుల దిశ‌గా అడుగులు వేయ‌ని ఫలితంగా.. ఆ పార్టీ పుట్టి మునిగింది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా.. అలానే చేస్తారా? లేక‌, మార్పుల దిశగా అడుగులు వేస్తారా? అన్న‌ది ఈ కార్య‌క్ర‌మం తేల్చేయ‌నుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.