కొమ్మినేనికి ఊర‌ట‌.. సుప్రీంలో బెయిల్‌

రాజ‌ధాని అమ‌రావ‌తిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేసులో ఏ2గా ఉన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివా స‌రావుకు ఊర‌ట ల‌భించింది. సుప్రీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆయ‌న‌ను జైలు నుంచి వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌జాస్వామ్యంలో భావ‌ప్ర‌క‌టనా స్వేచ్ఛను చంపేయ‌రాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వాక్ స్వాతంత్య్రాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది.

ఏం జ‌రిగింది?

ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జ‌రిగిన ఓ చ‌ర్చ‌లో ఎన‌లిస్టు, సీనియ‌ర్‌జ‌ర్న‌లిస్టు కృష్ణం రాజు.. అమ‌రావ‌తి రాజ‌ధాని మ‌హిళ‌ల‌పైతీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో యాంక‌ర్‌గా ఉన్న కొమ్మి నేని.. ఆయ‌న‌ను నిలువ‌రించ‌క‌పోగా.. ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల “ఔను..ఔను” అంటూ స‌మ‌ర్థించేలా వ్యాఖ్యానించా రు. ఏపీలో సెక్సు వ‌ర్క‌ర్లు పెరిగిపోయారంటూ.. ఓ ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని కృష్ణంరాజు ఉటంకిస్తూ.. అమ‌రావ‌తిలో అంతా వారే ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. దీనికి కొమ్మినేని స‌మ‌ర్థించారు.

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఉద్య‌మించారు. సాక్షి కార్యాల‌యాల ముందు ధ‌ర్నా చేశారు. దీనికి తోడు రాష్ట్ర మాదిగ కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ కంభంపాటి శిరీష పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు కేసు న‌మోదు చేసి ఏ1గా కృష్ణంరాజు, ఏ2గా కొమ్మినేని, ఏ3గా సాక్షి యాజ‌మాన్యా న్నిపేర్కొంది. ఈ క్ర‌మంలో ఏ1, ఏ2ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతంకొమ్మినేని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే.. ఆయ‌న నేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

శుక్ర‌వారం ఈ పిటిష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూనే కీల‌క వ్యాఖ్య‌లుచేసింది. “నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటాం. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి” అని వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ఆదేశాలు జారీ చేశారు.