ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. గత ఏడాది పాలనలో తనదైన శైలిని ప్రదర్శించారు. ఒకవైపు కూటమి పార్టీల్లో అనైక్యత రాకుండా చూసుకున్నారు. అదేసమయంలో ఎక్కడ ఏ సందర్భంలో తన అవసరం ఉంటుందని భావిస్తే..అక్కడ ఆయన గళం విప్పారు. ప్రజల మధ్యకు వచ్చారు. కేంద్రంతోనూ మాట్లాడారు. వైసీపీపై విరుచుకుపడ్డారు. విమర్శలు చేశారు. అంతేకాదు.. పవన్‌కు పాలన ఏం తెలుసు? అన్నవారికి వాయిస్ లేకుండా చేశారు.
ఇవన్నీ.. గత ఏడాది మెరుపులు. కానీ.. ఇప్పుడు అసలు ఏడాది ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదేళ్లకు మారే ప్రభుత్వం.. లేదా కొనసాగే ప్రభుత్వానికి తొలి, చివరి ఏడాదులు సొంత పనులు ఉంటాయి. తొలి ఏడాది హనీమూన్ అనుకుంటే.. చివరి ఏడాది ఎన్నికలకు కేటాయిస్తారు. ఆ రెండు పోగా.. మధ్యలో ఉండే మూడు సంవత్సరాలు కీలకం. దీనిలో తొలి ఏడాది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రారంభమైంది. మరీముఖ్యంగా ఓ 15 ఏళ్ల తర్వాతైనా.. సొంతగా అధికారంలోకి రావాలని భావిస్తున్న(అంతర్గతంగా) జనసేన ఆదిశగా పునాదులు పదిలం చేసుకోవాల్సి ఉంది.
దీనిలో భాగంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ ఏడాది ప్లాన్‌ను డిఫరెంట్‌గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ‘ప్రజాబాట’ పేరుతో నెలకు 15 రోజుల పాటు ప్రజల మధ్యే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే.. ఈ ఏడాది నుంచి దానిని ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టొచ్చు. అదేసమయంలో సినిమాలకు దాదాపు దూరంగా ఉండనున్నారు.
వాస్తవానికి గత ఏడాది కూడా.. అడపా దడపా ఒప్పుకొన్న సినిమాలే చేశారు. అదేసమయంలో గిరిజన ఓటు బ్యాంకు విషయంలో ఇప్పటికే ఒక నిర్దేశిత కార్యాచరణ ప్రారంభించిన పవన్ .. దీనిని మరింత పుంజుకు నేలా చేయనున్నారు. పౌరసరఫరాల శాఖను లైన్‌లో పెట్టారు. ఇక ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా.. రాష్ట్రంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మున్ముందు.. రచ్చబండ పేరుతో ప్రజలకు చేరువ కావడం.. పంచాయితీ సమస్యలు పరిష్కరించడం ద్వారా ఈ ఏడాది మరింతగా ప్రజలకు చేరువ అయ్యే దిశగా అడుగులు వేయనున్నారు. కార్యాలయాలు కాదు.. ప్రజల మధ్యే పాలన అనే సూత్రాన్ని ఈ ఏడాది పవన్‌లో మనం చూసే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates