తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబంలోని ఏ ఒక్కరికీ కూడా.. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అసలు శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారంటే..అది కేసీఆర్ కుటుంబమేనని చెప్పారు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువని తెలిపారు.
ఇక, కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి.. ఇచ్చే శాఖలపై కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాంటి చర్చలూ చేయలేదన్నారు. హైదరాబాద్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌రెడ్డి చెప్పారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్తవారికి కేటాయిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజ నం చేకూర్చడం లేదన్న రేవంత్ రెడ్డి.. తాము అభివృద్ధి పనులు చేపడుతున్నా కూడా.. కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారని విమర్శించారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్న రేవంత్ రెడ్డి.. కాళేశ్వరం పేరుతో కమీషన్ల ప్రాజెక్టును కట్టుకున్నారని, తెలంగాణ ప్రజల కష్టాన్ని దోచుకున్నారని వ్యాఖ్యానించారు. తాను కూడా కాళే శ్వరానికి సంబంధించిన నివేదికలను బయట పెడతానని చెప్పారు. కర్ణాటకలో కుల గణనపై మాత్రమే పార్టీ అధిష్టానంతో చర్చించినట్టు రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పారు.
నక్సలిజం ఎప్పటికి అంతం కాదని సంచలన కామెంట్లు చేశారు. సామాజిక అసమానతలు ఉన్నంత కాలం నక్సలిజం ఉంటూనే ఉంటుందన్నారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ.. రాష్ట్రానికి చెందిన వారే అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు.