‘కొణిదెల’ ఈ పేరు వింటేనే ఠక్కున గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఎందుకంటే.. వారి ఇంటి పేరు ‘కొణిదెల’. కానీ, ఈ పేరుతోనే ఒక గ్రామం కూడా ఉంది. ఈ విషయం ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో మారు మూల గ్రామమే ఈ కొణిదెల. ఇక్కడ సుమారు 2 వేల మంది ప్రజలు నివశిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలులో పవన్ పర్యటించారు.
ఈ సందర్భంగానే ఆయనకు ఈ గ్రామం గురించి తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన పవన్ కల్యాణ్.. తమ ఇంటి పేరుతో ఉన్న గ్రామానికి తాను ఇతోధిక సాయం చేస్తానని.. గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా కొణిదెల గ్రామానికి సాయం అందించారు. కొణిదెల గ్రామం అభివృద్ధి కోసం ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇటీవల పవన్‌ను కలిశారు. గతంలో ఆయన కొణిదెల గ్రామస్తులకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
దీంతో నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి 50 లక్షల రూపాయలను తన సొంత నిధుల నుంచి పవన్ కల్యాణ్ కేటాయించారు. ఆయన ఇచ్చిన సొంత నిధులను ఆయన ఇంటి పేరు మీద ఉన్న కొణిదెల గ్రామానికి సంబంధించి ఖర్చు చేయనున్నారు. ఈ క్రమంలో గ్రామానికి తాగునీరు సౌకర్యం, అదేవిధంగా ఇతర మౌలికసదుపాయాలు, అభివృద్ధి పనులకు ఉపయోగించనున్నారు. ఈ మేరకు సదరు చెక్కును కలెక్టర్‌కు అందించారు.
ఈ 50 లక్షల రూపాయలను .. గ్రామస్థుల అభ్యర్థన ప్రకారం గ్రామంలో 90 వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకు నిర్మించనున్నారు. అదేవిధంగా రోడ్లు, మురుగు కాల్వలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రచ్చబండల ఏర్పాటు, మొక్కల పెంపకం, పాఠశాలకు రహదారి, మౌలిక సౌకర్యాలను కల్పించనున్నారు. మొత్తానికి పుట్టిన ఊరునే కాదు.. ఇంటి పేరున్న ఊరుకు కూడా.. పవన్ సాయం చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పుట్టిన ఊరుకు సాయం చేయడం కామనే. కానీ, ఇలా ఇంటి పేరున్న ఊరుకు కూడా సాయం చేయడం ఇదే తొలిసారి.!
Gulte Telugu Telugu Political and Movie News Updates