బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌తో ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బుధవారం ఉదయం 6 గంటల సమయానికే ఆమె.. తన భర్త అనిల్‌తో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిశారు. అయితే.. ఇక్కడ రెండు విషయాలు చర్చకు వస్తున్నాయి. కేసీఆర్‌కు ‘డియర్ డాడీ’ అంటూ.. కవిత రాసిన లేఖ సంచలనం సృష్టించిన తర్వాత.. తొలిసారి ఆమె ఆయనతో భేటీ అయ్యారు. ఆ లేఖ రాసిన తర్వాత.. అమెరికాకు వెళ్లిన ఆమె.. అనంతరం.. ఈ లేఖ లీకు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి తిరిగి వస్తూనే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. కూడా ఆమె సూటి పోటి మాటలతో పార్టీని ఇరుకున పడేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అదేవిధంగా తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. పార్టీలో ట్వీట్లు చేసేందుకు పరిమితమయ్యారంటూ.. కాంగ్రెస్‌పై పోరాటం ఏదని కూడా ప్రశ్నించారు.
ఇక, 2వ విషయానికి వస్తే.. తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిన సమయంలో అనూహ్యంగా కవిత ఆయనతో భేటీ కావడం. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు కవితకు ఎలాంటి సంబం ధం లేకపోయినా.. కేసీఆర్ కోసం నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు ఆమె హుటాహుటిన కేసీఆర్ వద్దకు చేరుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా.. లేఖ అనంతరం బీఆర్ ఎస్‌లో ఏర్పడిన రాజకీయ పరిణామాలు.. తదనంతర కాలంలో జరిగిన ఘటనల అనంతరం.. కేసీఆర్‌ను కవిత కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంపై ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ వద్దకు కేసీఆర్ నేరుగా హాజరు కాకుండా(బహిరంగ విచారణ) ఆయనకు వీడియో విచారణకు అవకాశం కల్పించినట్టు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates