ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రకటించారు. “పోలీసులూ మీ ఇష్టం. ఎలాంటి చర్యలు తీసుకున్నా.. నేనేమీ అడగను. కానీ, రాష్ట్రంలో మహిళలకు, యువతులకు, చిన్నారులకు భద్రత కల్పించాలి. అసాంఘిక శక్తులు నేరం చేయాలంటేనే వణుకు పుట్టేలా చేయాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా సచివాలయంలో రాష్ట్ర డీజీపీ సహా హోం శాఖ సెక్రటరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత వారం రోజుల్లో రాష్ట్రంలో వెలుగు చూసిన పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య, కర్నూలులో బాలికపై సామూహిక అత్యాచారం.. వంటివాటిని ప్రస్తావించారు. పోలీసులకు స్వేచ్ఛనిస్తున్నామని.. అయినా.. నేరాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా గంజాయి ముఠా ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదన్నారు. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తాను తప్పుబట్టనని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని సీఎం తేల్చి చెప్పారు. గత వారంలో జరిగిన రెండు మూడు ఘటనలు తనను కూడా కలచి వేశాయన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ఆయన తగిన శిక్షలు పడేలా కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు.
నిందితులను ఉపేక్షించరాదని సీఎం సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను కట్టడి చేయాలని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిని నిరంతరం పర్యవేక్షించాలని.. అవసరమైతే.. ముందుగానే వారిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇవ్వాలని సూచించారు. నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని.. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని వివరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో గంజాయికి బానిసలుగా మారిన యువతను కూడా కనిపెట్టాలన్నారు.
ఇక, తాజాగా వెలుగు చూసిన సెక్స్ వర్కర్స్ రిపోర్టుపైనా చంద్రబాబు చర్చించారు. ఇది వాస్తవమైతే.. వెంటనే చర్యలు తీసుకుని.. మహిళలను, యువతులను ఆ వృత్తిలోకి దింపే వారిని కట్టడి చేసి పీడీ యాక్టులు బనాయించాలని పోలీసులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటివారిని ఉపేక్షించరాదన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పోలీసులు పనిచేయాలని, ప్రభుత్వానికి మచ్చతెచ్చేవారు ఎంతటివారైనా ఉపేక్షించరాదని తేల్చి చెప్పారు.