-->

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కుట్ర ప‌న్నారు: కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్‌

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావుకు మంగ‌ళ‌గిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను గుంటూరు జిల్లా జైలుకు త‌ర‌లించారు. అయితే.. కొమ్మినేనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీల‌క విష‌యాల‌ను పేర్కొన్నారు. సాక్షి మీడియా వేదిక‌గా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించి, అశాంతిని రెచ్చ‌గొట్టి, అల్ల‌ర్ల‌ను ప్రేరేపించే విధంగా కుట్ర ప‌న్నిన‌ట్టు పేర్కొన్నారు. దీనిని చాలా ప‌క‌డ్బందీగా ప్లాన్ చేశార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తిపై తీవ్ర వ్యాఖ్యానాలు చేశార‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను యాంక‌ర్‌గా ఉన్న‌ కొమ్మినేని వారించ‌క‌పోగా.. త‌న‌కు కూడా తెలుసున‌ని.. తాను కూడా ఎక్క‌డో చ‌దివాన‌ని పేర్కొంటూ.. ప్రోత్స‌హించార‌ని పోలీసులు తెలిపారు.

కొమ్మినేనిని తాము తొలుత విచారించ‌గా.. ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌న్నారు. దీంతో ఆయ‌న‌ను క‌స్ట‌డీకి తీసుకుని విచారిస్తే.. మ‌రిన్ని విష‌యాలు తెలుస్తాయ‌ని.. ఈ కుట్ర వెనుక ఎవ‌రున్నారు? ఎందుకు కుట్ర‌ప‌న్నారు..? వారి ప‌న్నాగం ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంద‌న్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్ర‌స్తుతం అదుపులో ఉన్నాయ‌ని.. వీటిని భగ్నం చేసేందుకే రాజ‌ధానిని కేంద్రంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. కొమ్మినేనిని రిమాండ్‌కు పంపాలన్నారు. అదేస‌మ‌యంలో ఈ కేసులో మరి కొందరు సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

కోర్టు ప్ర‌శ్న‌లు..

అయితే.. ఈ స‌మ‌యంలో కోర్టు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్ష‌న్‌ను ఎందుకు ప్ర‌యోగించార‌ని.. ప్ర‌శ్నించింది. ఆయ‌న ఎవ‌రినైనా పేరు పెట్టికానీ.. లేదా కులం పేరుతో కానీ.. దూషించారా? ఒక ప్రాంతాన్ని ఆయ‌న కులం ప్రాతిప‌దికగా విమ‌ర్శించారా? దీనికి త‌గు ఆధారాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించింది. అలాంటివి ఏవీ లేవ‌ని పోలీసుల త‌ర‌ఫున న్యాయ‌వాది తెలిపారు. మ‌రి అలాంట‌ప్పుడు ఆ సెక్ష‌న్ల‌ను ఎందుకు న‌మోదు చేయాల్సి వ‌చ్చింద‌ని నిల‌దీసింది. ఆ వెంట‌నే సెక్ష‌న్ల‌ను కొట్టేసింది. ఇదేస‌మ‌యంలో పోలీసుల‌పై న్యాయ అధికారి.. అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గ‌తంలోనే హైకోర్టు పోలీసుల తీరును త‌ప్పుబ‌ట్టింద‌ని.. అయినా.. మార్పు రావ‌డం లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

హైకోర్టుకు కొమ్మినేని..!

త‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ.. కొమ్మినేని త‌ర‌ఫున న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలిసింది. మంగ‌ళ‌గిరి కోర్టుకు వ‌చ్చి బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా.. అప్ప‌టికే స‌మ‌యం మించిపోవ‌డంతో వారు హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలిసింది. వ‌య‌సు, స‌మాజంలో ఉన్న పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. అదేస‌మ‌యంలో అస‌లు ఈ చ‌ర్చ‌ల్లో ఆయ‌న కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మేన‌ని.. వ‌క్త‌లుచేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న బాధ్యుడు కాద‌ని న్యాయ‌వాది ఒక‌రు మీడియాకు చెప్పారు.