బందరు పోర్టు నిర్మాణానికి 36 నెలలే డెడై లైన్ ?

సంవత్సరాల తరబడి వివాదాస్పదంగా ఉండిపోయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణం, అభివృద్ది పనులు ఇప్పటికైనా మొదలవుతుందా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2009 లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం, అభివృద్ధి కాంట్రాక్టు బాధ్యతను నవయుగ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చినా వివిధ కారణాల వల్ల పనులు మొదలుకాలేదు. చివరకు 2014లో జరిగిన రాష్ట్ర విభజన కారణంగా అసలు ప్రాజెక్టు పనులే అటకెక్కాయి. దాన్ని ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముదులిపి ప్రాజెక్టును పట్టాలు ఎక్కించటానికి రెడీ అవుతోంది.

తాజాగా అంటే సోమవారం ప్రాజెక్టుకు పనులకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట రిపోర్టును ఆమోదిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి తొందరలోనే పనులు ప్రారంభం అవుతాయని అందరు అనుకుంటున్నారు. ప్రాజెక్టు మొదటిదశ పనులను రూ. 5835 కోట్లతో పూర్తిచేయాలని రాష్ట్రప్రభుత్వం డిసైడ్ చేసింది. మొన్న ఆగష్టు నెలలో రైట్స్ సంస్ధ అందించిన డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టును ప్రభుత్వమే యాజమన్య పద్దతిలో డెవలప్ చేయాలని సూచించింది.

ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్ ప్రకారం మొదటి దశను 36 నెలల్లోనే పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నది. కార్గో రవాణా కోసం నాలుగు బెర్తులు, బొగ్గు కంటైనర్లను నిలపటానికి ఒక్కో బెర్తును నిర్మించాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది. 800 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న పోర్టులో ప్రభుత్వ వాటాగా వెయ్యికోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మిగిలిన రూ. 4785 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోవటానికి, టెండర్ ప్రక్రియను నిర్వహించటానికి ఏపి మారిటైం బోర్డుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.

తమ చేతిలో ఉన్న కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినపుడు నవయుగ సంస్ధ కోర్టుకెళ్ళినా ఉపయోగం లేకపోయింది. కాంట్రాక్టు పనులు దక్కించుకుని సంవత్సరాలు అవుతున్నా పనులు మొదలు పెట్టకపోవటమే నవయుగ సంస్ధ ఫెయిల్యూరంటూ ప్రభుత్వం చేసిన వాదనకే కోర్టు కూడా మద్దతుగా నిలవటంతో కాంట్రాక్టు రద్దయిపోయింది. కాబట్టి తొందరలోనే టెండర్లు పిలిచి పనులను అప్పగించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

కాకినాడ పోర్టును జీఎంఆర్ సెజ్ గేట్ వే ప్రైవేటు లిమిటెడ్ కు అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణ పనులను, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణ, అభివృద్ధి పనులకు రైట్స్ సంస్ధ తయారు చేసిన డీపీఆర్ ను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. కాబట్టి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు పనులు మొదలై పూర్తయితే పోర్టుల ద్వారా యాక్టివిటీ బాగా ఊపందుకునే అవకాశాలున్నాయి.