సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా యాంకర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి స్థానిక కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనికి ముందు మంగళవారం ఉదయం వరకు.. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్‌లోనే ఉంచిన ఆయనను.. తర్వాత.. గుంటూరుకు తరలించారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. సుమారు గంటకు పైగా.. ఇక్కడే సమయం సరిపోయింది.
అనంతరం.. కొమ్మినేని ఆరోగ్యం బాగానే ఉందని.. స్వల్పంగా రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. దీనిని తీసుకుని పోలీసులు మంగళగిరి కోర్టులో ఆయనను హాజరు పరిచారు. దీనిని పరిశీలించిన కోర్టు.. 14 రోజలు రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేశామని.. బెయిల్ ఇవ్వరాదని కోరారు.
వాస్తవానికి అప్పటికి కొమ్మినేని తరఫున న్యాయవాదులు ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇంతలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని పక్కన పెట్టిన కోర్టు రిమాండ్ విధించింది. అమరావతి మహిళలపై ఓ వ్యాఖ్యాత తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో సాక్షి మీడియా యాంకర్‌గా ఉండి.. ఆ డిబేట్‌ను నిర్వహిస్తున్న కొమ్మినేని ఆ వ్యాఖ్యలను నిలువరించలేదని.. పైగా ప్రోత్సహించేలా వ్యాఖ్యానించారని.. తుళ్లూరుకు చెందిన కంభంపాటి శిరీష్ అనే దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొమ్మినేని సహా సాక్షి, వ్యాఖ్యాతలపై కేసులు నమోదు చేశారు.