ఆర్థిక సంపద పెంచి పేదలకు పంచుతాం: చంద్రబాబు

ఏపీలో ‘స్వ‌ర్ణాంధ్ర‌’ పేరుతో సీఎం చంద్ర‌బాబు కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ప్ర‌భుత్వం వాట్సాప్ ద్వారా 300 ర‌కాల సేవ‌ల‌ను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వ‌ర్ణాంధ్ర కార్యాల‌యాల ద్వారా సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. ఈ కార్యాల‌యాల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. స‌ర్వీస్ సెక్టార్ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు.

రాష్ట్రానికి ఆదాయం పెరిగితే.. దానిని పేద‌ల‌కు పంపిణీ చేస్తామ‌ని.. సంప‌ద సృష్టి ద్వారా మ‌రిన్ని ప‌థ‌కాల‌ను అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స‌ర్వీస్ సెక్టార్ ద్వారా ప్ర‌భుత్వం నూటికి ఆరు రూపాయ‌లు మాత్ర‌మే ఆదాయం వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సేవా రంగాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా సాంకేతిక‌త‌ను వినియోగించుకుని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రంగానికి కీల‌కంగా మార్చ‌నున్న‌ట్టు తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ నెల‌లోనే త‌ల్లికి వంద‌నం, ఆగ‌స్టు 15న ఉచిత ఆర్టీసీ బ‌స్సు వంటివి అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కేవ‌లం సంక్షేమమే కాకుండా.. అభివృధ్ది-సంక్షేమాన్ని కూడా స‌మాంత‌రంగా ముందుకు తీసుకువెళ్ళ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామ‌న్నారు. అనేక రంగాలు గ‌త పాల‌కుల కార‌ణంగా విధ్వంస‌మ‌య్యాయ‌ని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామ‌న్న చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా మ‌రో మూడేళ్ల‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.