వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓ పెద్ద తలనొప్పి మెడకు చుట్టుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానెల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. అమరావతిని దేవతల రాజధాని అనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అది వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ మాట్లాడ్డమే కాక.. అమరావతిలో సెక్స్ వర్కర్లు ఎక్కువ అనే వార్తను తాను కూడా చూశానంటూ వంత పాడి చిక్కుల్లో పడ్డారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు.
సోమవారం కొమ్మినేనిని హైదరాబాద్‌కు వచ్చి మరీ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షి టీవీకి సంబంధం లేదని పేర్కొంటూ.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని వాదిస్తోంది. ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు.
కొమ్మినేని అరెస్ట్ ఎలా అక్రమమో చెప్పాల్సింది పోయి.. అమరావతి మహిళల మీద ఆయన మరింతగా నోరు పారేసుకున్నారు. జగన్ అమరావతి మహిళలను అవమానిస్తారా, ఆయన ఛానెల్ ఆ పని చేస్తుందా అంటూ ప్రశ్నించిన సజ్జల.. సాక్షికి, జగన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసిన అమరావతి మహిళలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లు పిశాచాలు, రాక్షసులు, అంతకుమించిన సంకర జాతి అంటూ తీవ్రంగా దూషించారు.
వారిలో పైశాచికత్వం కమ్ముకుందని.. అందుకే జగన్ ఫొటోలను చెప్పులతో కొట్టడం లాంటివి చేశారని.. వీళ్లందరూ ఆర్గనైజ్డ్‌గా వైసీపీ మీద, జగన్ మీద విషం కక్కుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే పెద్దదిగా మారిన వివాదాన్ని చల్లార్చాల్సింది పోయి.. అమరావతి మహిళల మీద ఇంకా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా వైసీపీకి మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నారు సజ్జల. అమరావతి మీద వైసీపీకి ఉన్న అక్కసుకు ఇది నిదర్శనమంటూ ఆయన మీద సోషల్ మీడియాలో ఆ ప్రాంత మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు.