అమ‌రావ‌తి నిర్మాణమూ బాబుకు సంక‌ట‌మే.. ఏంటి క‌ష్టాలు…!

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని భుజాల‌కెత్తుకున్న చంద్ర‌బాబు దీనిని 2027 నాటికి పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన భ‌వ‌నాల‌ను.. ముఖ్య నిర్మాణాల‌ను పూర్తి చేసి.. 2029 ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తిని ప్ర‌ధాన అజెండా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌ధానంగా న‌వ న‌గ‌రాల‌ను పూర్తిచేయాల‌ని అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఇటు పార్టీలోను.. అటు ప్ర‌భుత్వంలోనూ చంద్ర‌బాబు చ‌ర్చిస్తూనే ఉన్నారు. త‌న ప్ర‌ణాళిక‌ల‌ను వారికి వివ‌రిస్తున్నారు.

అయితే.. వీటిని పార్టీలో నాయ‌కులు కానీ.. ఇత‌రులు కానీ.. పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనికి కార‌ణం.. అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ముడి స‌రుకును బ్లాక్ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముడి స‌రుకును క్షేత్ర‌స్థాయిలో రాష్ట్రం నుంచే సేక‌రించాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు తేల్చి చెప్పారు. త‌ద్వారా ధ‌ర‌లు త‌గ్గి.. అమ‌రావ‌తి నిర్మాణ వ్య‌యం అదుపులో ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. దీనికి సంబంధించి కాంట్రాక్టు సంస్థ‌ల‌కు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేశారు.

దీంతో రాష్ట్ర స్థాయిలో తూర్పు, ప‌శ్చిమ‌, కృష్ణాజిల్లాల నుంచి ఇసుక‌ను, క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌పల నుంచి రాయిని సేక‌రిస్తున్నారు. ఇక‌, ఐర‌న్‌ను విశాఖ నుంచి సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇసుక విష‌యంలో మాత్రం కాంట్రాక్ట‌ర్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. దీనికి కార‌ణం బ్లాక్ చేయ‌డం.. లేదా భారీ ధ‌ర‌ల‌కు వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం. ఈ రెండు కార‌ణాల‌తో ప‌ట్టుమ‌ని 100 లారీల ఇసుక కావాల‌న్నా.. వారాల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయితే.. దీనిపై ప్ర‌భుత్వం ఏం జ‌రుగుతోంద‌న్నది విచారించింది. ఇలా బ్లాక్ చేస్తున్న‌వారు బ‌య‌టి వారు కాద‌ని.. సొంత పార్టీకి చెందిన వారే ఉన్నార‌ని తెలిసి.. చంద్ర‌బాబు షాక్‌కు గుర‌య్యార‌ని స‌మాచారం. ఇదేవిష‌యాన్ని తాజాగా ఆయ‌న హెచ్చ‌రించారు. అమ‌రావ‌తి నిర్మాణానికే ఇసుక దొర‌క‌డం లేదంటే.. ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. దీనిలో ఎవ‌రు ఉన్నా వ‌దిలి పెట్టేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇక‌, కంక‌ర విష‌యంలోనూ ఇలానే జ‌రుగుతుండ‌డంపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.