=

అవును.. వైసీపీ ‘పేరు’పోతోంది ..!

వైసీపీ పేరు పోతోంది! ఈ మాట ఆ పార్టీ అధినేత జ‌గ‌నే చెప్పారు. తాజాగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న చెప్పిన మాట ఇదే!!. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. మ‌రోసారి ప్ర‌జ‌ల్లోకి రావాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశం. కానీ, అలా వ‌చ్చేందుకు ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. వైసీపీ హ‌యాంలోనే.. ‘పేరు’ రాజ‌కీయాలు జ‌రిగాయి. అప్ప‌ట్లో అన్న క్యాంటీన్ల‌ను తొల‌గించారు. వీటిని నిర్వీర్యం చేయ‌డం ద్వారా చంద్ర‌బాబుకు పేరు రాకుండా చేయాల‌న్న దురుద్దేశం ఉంద‌ని అప్ప‌ట్లోనే కాదు.. ఇప్పుడు కూడా.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

అదేవిధంగా టీడీపీ ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేసిన విదేశీ విద్య ప‌థ‌కాన్ని నిలుపుద‌ల చేశారు. ఇది కూడా.. పేరు వివాదమేన‌ని అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కులు చెప్పుకొచ్చారు. కూట‌మి స‌ర్కారు రాగానే.. అన్న క్యాంటీన్ల ను ప్రారంభించారు. విదేశీ విద్య ప‌థ‌కాన్ని కూడా ప్రారంభించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు గ‌తంలో వైసీపీ చేసిన‌ట్టే.. కూట‌మి ప్ర‌భుత్వం కూడా చేస్తోంది. వైసీపీ పేరును తీసేసేందుకు కృత నిశ్చ‌యంతో ముందుకు సాగుతోంది. అయితే.. దీనిని ఎదిరించేందుకు వైసీపీకి చాన్స్ లేకుండా పోయింది.

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టారు. దీనిని జ‌గ‌నే రెన్యువ‌ల్ చేయ‌లేద‌ని.. తాము ఎలా చేస్తాన్న ప్ర‌శ్న‌లు కూట‌మి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇక‌, ఈ విష‌యాన్ని వైసీపీ కూడా వదిలేసింది. ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వలంటీర్లు.. త‌మ‌కు కాకుండా.. టీడీపీకి అనుకూలంగా ప‌నిచేశార‌ని ఆ పార్టీ అధినేత చెబుతున్నారు. ఇక, రేష‌న్ దుకాణాల‌ను ప్రారంభించి.. బళ్ల‌ను నిలిపివేశారు. త‌ద్వారా.. వైసీపీ తీసుకువ‌చ్చిన ప‌థ‌కం ఆగిపోయింది. అయినా.. ఎదురుమాట్లాడే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఇక‌, ఇంటింటికీ వైద్యం పేరుతో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి కూడా బ్రేకులు వేస్తున్నారు. అవినీతి పెరుగుతోంద‌ని.. ఇంటింటికి వైద్యంలో కొంద‌రు అవినీతికి పాల్ప‌డుతు న్నార‌ని స్వ‌యంగా మంత్రి చెప్పారు. సో.. దీనిని కూడా ఆపేశారు. మ‌రికొన్నిచోట్ల కూడా ఆపేస్తున్నారు. ఇలా.. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌కు పేరు తెచ్చిన కొన్ని ప‌థ‌కాల‌ను నిలిపివేయ‌డం ద్వారా వైసీపీ పేరు లేకుండా చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. కానీ, ఈ విష‌యంలో పోరాటాలు చేసేందుకు ఆ పార్టీకి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.