వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ప్రభుత్వం ఇంకా నివేదికలు తెప్పించుకుంటూనే ఉంది. గత జగన్ పాలనలో జరిగిన మద్యం, ఇసుక అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇసుక లభ్యత లేని సీమలోని పలు జిల్లాల్లో మట్టి అక్రమాలపై విచారణ చేయించేందుకు ప్రభు త్వం రెడీ అయింది. మట్టిని కూడా వదలకుండా గత వైసీపీ నాయకులు, మంత్రులు దోచుకున్నారన్నది సర్కారుకు వచ్చిన ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది.
వీటిపైనే ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించేందుకు సిద్ధమైంది. మట్టి అక్రమాలు ఏ రేంజ్‌లో జరిగాయి? ఎవరెవరి పాత్ర ఉంది? ఎంత మొత్తం నిధులు దారి మళ్లాయి? అప్పటి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంది? ఇలా.. అనేక విషయాలపై కూపీ లాగేందుకు నిర్ణయించుకుంది. ఈ బాధ్యతలను జిల్లాల డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించింది. దీంతో గత నాలుగు రోజుల కిందటే మట్టి అక్రమాలపై నివేదికలు ప్రభుత్వానికి చేరాయని తెలిసింది.
అయితే.. వీటిని గోప్యంగా ఉంచుతున్నారు. దీనికి కూడా కారణం ఉందని సమాచారం. అప్పట్లో జరిగిన అక్రమాల్లో కొందరు అప్పటి ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారని నివేదికలు తేల్చాయని సమాచారం. అయినప్పటికీ.. విచారణకు ఆదేశించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ.. ఇది విచారణకు వస్తే.. కొందరు అధికార పార్టీ నాయకులు కూడా ఇరుకున పడే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అలాగని వైసీపీ నాయకులను వదిలేది లేదన్న వాదనా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. కర్నూలు, కడప, కృష్ణా, వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ నాయ కులు భారీ ఎత్తున మట్టిని తరలించారు. అప్పట్లో నిర్మాణాలు ప్రారంభించిన జగనన్న ఇళ్లకు ఈ మట్టిని తరలించి.. అటు ప్రభుత్వం నుంచి ఇటు.. అక్రమాల రూపంలోనూ సొమ్ములు పోగేసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న జగనన్న ఇళ్లపైనా విచారణకు ఆదేశిస్తే.. మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం అంతర్గత విచారణ అయితే.. జోరుగా సాగుతోంది.